మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 16 మార్చి 2015 (11:48 IST)

సాహితీవేత్త రాళ్లబండి కవితా ప్రసాద్ ఇకలేరు!

ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ దళిత అభివృద్ధి సంస్థ సంయుక్త కార్యదర్శి రాళ్లబండి కవితా ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 55 ఏళ్లు. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచీ వెంటిలేటర్‌పై ఉంచి గుండె సంబంధ సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. నిరంతరం డయాలసిస్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కిడ్నీ కూడా ఫెయిల్‌ అయినట్టు గుర్తించారు. కవితాప్రసాద్‌ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం వ్యక్తం చేశారు. సాహితీ వేత్తల్లో ఆయన స్థానం సుస్థిరమైనదని కొనియాడారు. 
 
అవధానిగా, సాహితీవేత్తగా, సాహిత్య విమర్శకుడిగా రాళ్లబండి పండితుల ప్రశంసలందుకున్నారు. పద్య సాహిత్యంపైన పట్టు సాధించిన అరుదైన పండితులలో అగ్రగణ్యుడు కవితాప్రసాద్. పరిపాలనా దక్షుడుగా, విద్వద్విమర్శకుడిగా ఆయన కీర్తి గడించారు. ఆయన మరణవార్త తెలిసిన సాహితీవేత్తలు, పండితులు, విద్వాంసులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా నెమలి ఆయన స్వస్థలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవధాన విద్యను ప్రచారం చేయడంలో, అవధానాలు నిర్వహించడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి అవధాన విద్యపైన ఆయన డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన రచించింన ఒంటరి పూల బుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయంవంటి గ్రంథాలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయి. 
 
ఈయన ఆరేళ్ళ పాటు సాంస్కృతిక శాఖకు డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పదవి నిర్వహించారు. హాస్టళ్ల కుంభకోణంపై విచారణ జరిపి, ప్రామాణికమైన నివేదికను గత ప్రభుత్వానికి అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రాచలం, యాదగిరి గుట్ట తదితర క్షేత్రాలలో జరిగిన కళ్యాణోత్సవాలకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవితా ప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. రాళ్లబండి భౌతికదేహానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
 
రాళ్లబండి కవితా ప్రసాద్ మరణంపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటి సాహితీ ప్రక్రియలలో పట్టు సాంధిచిన పండితుడు కవితాప్రసాద్ అని సీఎం నివాళులు అర్పించారు. కవితాప్రసాద్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం సాహితీలోకానికి తీరని లోటన్నారు.