శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (12:53 IST)

రియల్ శివగామి: నీట మునిగిపోతూ.. బిడ్డను ఒడ్డుకు చేర్చింది.. ఎలా?

బాహుబలి సినిమాకు శివగామి పాత్రలోని రమ్యకృష్ణ తాను నీటిలో మునిగిపోతూ బిడ్డను మాత్రం చేతిలో పైకెత్తి పట్టుకుని... చిన్నారి ప్రభాస్‌ను రక్షిస్తుంది. తాను ప్రాణాలు విడుస్తుంది. ఈ సీన్ అందరికీ గుర్తిండే వుంటుంది. బాహుబలి చిత్ర కథకు ఈ సీనే మూలాధారం.

అచ్చం అలాంటి ప్రమాదంలో చిక్కుకున్న ఓ మహిళ రియల్ శివగామి అనిపించుకుంది. తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా.. తన కుమారుడిని మాత్రం బతికించాలనుకుంది. అనుకున్నట్లే ఈ రియల్ శివగామి కొడుకును ఎలాగోలా ఒడ్డుకు చేర్చి తాను మాత్రం ప్రాణాలు విడిచింది. తద్వారా మాతృ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దిగువకన్నికాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దిగువకన్నికాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, అతడి భార్య భువనేశ్వరి (23) మాత్రం గ్రామంలోనే ఉంటూ పశువులను కాస్తోంది. ఆ దంపతులకు రెండేళ్ల కుమారుడు కరుణాకర్ ఉన్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం బిడ్డను చంకనేసుకుని భువనేశ్వరి పశువులను కాసేందుకు వెళ్లింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలో అటవీ అధికారులు తవ్విన కందకం పూర్తిగా నీటితో నిండిపోయింది. 
 
లోతెంతుంటుందో తెలియని కందకంలోకి భువనేశ్వరి దిగింది. లోతెక్కువ ఉండటంతో ఆమె క్రమంలో నీటిలో మునిగిపోతోంది. ప్రమాదాన్ని గమనించిన భువనేశ్వరి తన ప్రాణం పోయినా.. బిడ్డ ప్రాణాలు నిలబెట్టాలనుకుని.. చంకలోని కొడుకును ఒక వేటుతో ఒడ్డుకు విసిరేసింది. మరుక్షణమే ఆమె నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే తల్లి కోసం కందకం వైపు బాలుడు వచ్చేస్తున్నాడు. మరికాసేపుంటే బాలుడు కందకంలో పడిపోయేవాడే. అదే సమయంలో అటుగా వచ్చిన భువనేశ్వరి సమీప బంధువు రంగమ్మ బాలుడు ఒంటరిగా ఉండటాన్ని చూసి అతడిని ఎత్తుకుని పరికించి చూడగా, భువనేశ్వరి ప్రాణాలు కోల్పోయిందని తెలిసింది. ఇలా భువనేశ్వరి రియల్ శివగామి అనిపించుకుంది.