బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 14 మే 2015 (17:17 IST)

ఈగో కారణంగానే స్ట్రీట్ ఫైట్ : నబీల్ మృతి వెనుక ప్రేమ కోణం లేదు!

హైదరాబాద్ పాతబస్తీలో వెలుగులోకి వచ్చిన స్ట్రీట్ ఫైట్ వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు బహిర్గతం చేశారు. ఈ ఫైట్‌లో ప్రాణాలు కోల్పోయిన నబీల్ మృతి వెనుక ఎలాంటి ప్రేమ కోణం లేదని వారు తేల్చి చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఒవైస్ పటేల్ బడాయికి పోయి విచక్షణారహితంగా కొట్టడం వల్లే నబీల్ మృతి చెందినట్టు చెప్పారు. అంటే ఈగో, అల్లరి చేష్టలు, బిర్యానీ పోటీలే దీనికి కారణమన్నారు. 
 
ఈ వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. గురువారం ఇంకా ఆయన మాట్లాడుతూ... నబీల్ హత్యోదంతంలో ఇద్దరు మైనర్లు సహా 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలిపారు. అలాగే ఈ ఘటనలో పలువురి తల్లిదండ్రులను, ఇతర మిత్రులను కూడా విచారించినట్టు చెప్పారు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒవైస్ పటేల్ తరచూ సహ యువకుల వద్ద బడాయికి పోయేవాడని, ఆధిపత్యం ప్రదర్శించేవాడని ఆయన చెప్పారు. గల్లీల్లో తీసుకున్న డ్రెస్‌లు, షూలు కొనుక్కుని అవి ఇంపోర్టెడ్ వంటూ అబద్దాలు చెప్పేవాడని, అతని బడాయిని నబీల్ బ్యాచ్ ఎద్దేవా చేసేవారని ఆయన తెలిపారు. 
 
ఈ నేపథ్యలోనే వారిద్దరూ ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేది తేల్చుకునేందుకు స్నేహితుల ప్రోత్సాహంతో స్ట్రీట్ ఫైట్ కు దిగారని ఆయన వెల్లడించారు. ఒవైస్ పటేల్ విచక్షణారహితంగా కొట్టడంతో బ్రెయిన్ కు తీవ్రగాయమైన నబీల్ మృతిచెందాడని ఆయన తెలిపారు.