సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
సంక్రాంతి సంబరాలు లక్కీడ్రా కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు.
గత 2023 జనవరిలో అంబటి రాంబాబు మంత్రి హోదాలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఇందుకోసం అక్కడి వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు నెలవారీగా ఇచ్చే పింఛను మొత్తం నుంచి రూ.200 చొప్పున మినహాయించుకుని రెండేసి లాటరీ టికెట్లు ఇచ్చారు. సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతులు పంచారు.
ఇది చట్టవిరుద్ధమని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అప్పట్లో సత్తెనపల్లి పట్టణ పోలీసులు రాంబాబుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. దీనిపై నమోదైన కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం.కుముదిని బుధవారం పీటీ వారంట్ జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.
దీంతో గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరు పర్చారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.