శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2025 (19:53 IST)

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

talasani srinivas yadav
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు. దీంతో ఈ ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరికి మద్దతిస్తారన్న ఆసక్తికర చర్చ తెలంగాణ రాజకీయ నేతల్లో జరుగుతోంది. దీనిపై మాజీ మంత్రి తలసాని శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. 
 
'నవీన్ యాదవ్‌తో నాకు బంధుత్వం ఉన్నమాట నిజమే. గతంలో అతనికి రాజకీయంగా కొన్ని సూచనలు కూడా ఇచ్చాను. కానీ ఇపుడు పరిస్థితులు వేరు. నేను భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాంటపుడు మా పార్టీ అభ్యర్థిని కాదని వేరే వారికి ఎలా మద్దతిస్తాను' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, బీఆర్ఎస్‌లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 
 
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నానని, తలసాని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా గురువారం కేటీఆర్‌తో కలిసి బస్ భవన్‌కు వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తన విధేయత ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకేనని, జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసమే మేమంతా పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, బీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఈ స్థానానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకిదించారు. కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్‌ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. దీంతో ఈ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.