పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు కర్రుకాల్చి వాతపెట్టిన చంద్రబాబు
టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గల టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్రుకాల్చి వాతపెట్టారు. పిఠాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు. అదేసమయంలో ఆ నియోజకవర్గంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లోతుగా విచారణ జరిపి ఓ నివేదిక సమర్పించేందుకు, ఆ నియోజకవర్గం వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ కసరత్తు ప్రారంభించింది.
కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ లోలోపల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైగా, కూటమి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, చిన్నపాటి వివాదాలకు ప్రధాన కారకులుగా ఉంటున్నారు. ఇది పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఇటీవల బ్యానర్‌లో చంద్రబాబు ఫోటో లేదని పెద్ద రాద్దాంతం సృష్టించడమే కాకుండా జనసేన పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, వర్మను పరోక్షంగా మందలించారు కూడా. ఈ నేపథ్యంలో వర్మను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
