1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Tech Giant IBM Returns to Visakhapatnam, nara lokesh tweet

ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్‌లో ఐబీఎం సేవలు

ibm name board
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఐబీఎం విశాఖపట్టణంలో తన సేవలను ప్రారంభిచనుంది. ఈ మేరకు వైజాగ్‌లో ఐబీఎం సంస్థ బోర్డు తాలూకు ఫోటోను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐబీఎంకు వైజాగ్ తరపున స్వాగతం అంటూ పోస్టు చేశారు. ఐబీఎం రాకతో విశాఖలో ఐటీ స్వరూపమే మారిపోనుంది. అలాగే, ఐటీ రంగం కూడా మరింత బలోపేతం కానుందని ఆయన గతంలోనే పేర్కొన్న విషయం తెల్సిందే. 
 
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఐబీఎం తిరిగి విశాఖకు వస్తోంది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన కార్యకలాపాల కోసం ఇప్పటికే తమ పేరును నమోదు చేసుకుంది. ఈ కేంద్రం ద్వారా తొలుత 500 మందికిపైగా ఉద్యోగులకు ఉపాధి లభించనుంది. రాబోయే మూడేళ్లలో సుమారు రూ.321 కోట్ల విలువైన ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. 
 
రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. గత జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన విషయం తెల్సిందే. 
 
ఈ చర్చల ఫలితంగానే ఇపుడు ఐబీఎం విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. గతంలో మధురవాడలో ఐటీ సెజ్‌లో ఐబీఎం కార్యాలయం ఉండేది. ఇపుడు మళ్లీ అక్కడ నుంచే కార్యకలాపాలు ప్రారంభించడం ద్వారా విశాఖ కీలక ఐటీ గమ్యస్థానంగా మారనుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా పేరు మార్చే అంశాన్ని పరిశీలిస్తాం : కేటీఆర్