రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ రేణుకా చౌదరి నినాదాలు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రాజ్యసభలో 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. ఈ అరుదైన దృశ్యం గురువారం రాజ్యసభలో కనిపించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగింది. దీనిపై రేణుకా చౌదరి ప్రసంగించారు.
అమరావతి ఉద్యమ సమయంలో రైతులు, మహిళలను తీవ్రంగా హింసించినా, వారు వెనుకడుగు వేయకుండా పోరాటం కొనసాగించారని గుర్తుచేశారు. గత 12 యేళ్లుగా ఏపీ రాజధానిపై కొనసాగుతున్న అస్పష్టత వల్లే రాష్ట్రానికి రావల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. కేవలం బిల్లు పెట్టడమే కాదు.. నిర్ణీత సమయంలో రాజధానిని పూర్తి చేసి చూపించాలని డిమాండ్ చేశారు. విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలతో ఆటలు ఆడుతోందని మండిపడ్డారు.
దుంగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌ను ముగిసిన అధ్యాయాలుగా మార్చేశారని విమర్శించారు. తెలంగాణాకు హమీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్.టి.పి.సిలకు కూడా కేద్రం ఇవ్వలేదని తెలిపారు. ఇన్నేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్రం సమాధానం చెప్పాలని, రెండు రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర విభజన జరిగి 12 యేళ్లు గడిచినా లక్షా 47 వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి చేయలేదని ఆమె గుర్తు చేశారు. భౌగోళికంగా ఏపీలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణాలో ఉండాలని కోరుకుంటున్నా, వారిలో ఏపీలో కలపడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
