శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (11:15 IST)

అడవిలో పెద్దపులి... అటువైపు వెళ్లొద్దంటున్న అటవీ అధికారులు

ఆ అడవిలో పెద్దపులి సంచరిస్తోంది. దయచేసి గ్రామస్థులెవ్వరూ అటువైపు వెళ్లకండి అంటూ పలు గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగావ్ మండలం దిగుటలో ఒకరిని, పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామంలో మరొకరిని ఓ పెద్దపులి పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
దీనిపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ, 'అడవిలో పెద్ద పులి తిరుగుతోంది. అటు వైపు వెళ్లకండి' అంటూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులకు కూడా పోవద్దంటున్నారు. ఈ మేరకు అటవీ పరిసర గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. 
 
పులి ఎక్కడ మాటు వేస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ముందుగా భిన్నాభిప్రాయాలతో ఉన్న అధికారులు తాజా సంఘటన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నారు. పంటల ఫలితాలు వచ్చే సమయంలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లవద్దని అటవీ అధికారులు హెచ్చరించడం గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోంది.
 
ఒకే పులి వరుసగా దాడులు చేస్తున్నదని, అది కిల్లర్ క్యాట్ ( మ్యాన్ హంటర్) కావచ్చని స్థానికులు భయపడుతున్నారు. అటవీ అధికారులు మాత్రం వేరు వేరు పులులు తిరుగుతున్నాయని అంటున్నారు. అటవీ గ్రామాలలో పులుల సంచారంపై ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పులి సంచారంతోపాటు దాని అడుగు జాడలను తెలుసుకుని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచిస్తున్నారు.