గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 17 జనవరి 2016 (11:52 IST)

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు.. అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం కదా : వెంకయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లే దక్కే నిధులు, ప్రయోజనం కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగానే చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రకు ఇచ్చినన్ని సంస్థలు, ప్రాజెక్టులు, నిధులు స్వాతంత్ర్యానంతరం ఏ ప్రభుత్వమూ ఏ రాష్ట్రానికీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. 
 
ప్రత్యేక హోదాను మించిన హోదాను తాము ఏపీకి ఇస్తున్నామని, అందువల్ల ప్రత్యేక హోదా గురించి ఇకపై మాట్లాడనక్కర్లేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సును కేంద్ర వాణిజ్య శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించాయని, ఈ సందర్భంగా ఏపీలో రూ.4 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు.
 
కేంద్రం సంస్కరణలను వేగవంతం చేయటం, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సంస్కరణలకు అనుకూలమని, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయం పారిశ్రామికవేత్తల్లో ఉండటమే ఈ పెట్టుబడులు రావడానికి కారణమన్నారు. ఏపీలో వెయ్యి కిలోమీటర్ల జాతీయ రహదారి, వెయ్యి కిలోమీటర్ల రైలు మార్గం, సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నాయని ఇలాంటి అవకాశాలు మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.