పిల్లలే మన సంపద .. జనాభాను పెంచండి : సీఎం చంద్రబాబు
పిల్లలే మన సంపద అని, అందువల్ల జనాభాను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణ నినాదం రావాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు జనాభా తగ్గాలని అందరం కోరుకున్నామని, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చెప్పామన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. పిల్లలే సంపద అనే మాటను నిజం చేస్తామన్నారు.
'ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతోంది. యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయాలి. ఆడపిల్లలు ఇప్పుడు ఇంటికి భారం కాదు.. ఆస్తి. ఐటీ చదువుకోవాలని గతంలో ఆడపిల్లలను ప్రోత్సహించా. వరకట్నం కాదు.. ఆడపిల్లలకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా జనాభా తగ్గిపోతోంది. నగరాలు, అర్బన్ ప్రాంతాల్లో జనాభా బాగా తగ్గిపోతోంది. పిల్లల సంఖ్య తగ్గి.. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇంట్లో పెద్దలు లేకపోతే పిల్లల పెంపకంలో అనేక ఇబ్బందులు వస్తాయి. పిల్లలే మన రాష్ట్ర సంపద.. వారితోనే ఆర్థిక ప్రగతి. సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయి.
పిల్లల్ని పెంచే బాధ్యతను తండ్రి కూడా తీసుకోవాలి. ఇంటిపని, వంటపని అనే తేడా లేదు. అన్నింట్లోనూ మగవాళ్లు సాయం చేయాలి. సంజీవిని కింద డిజిటల్ ఆరోగ్య రికార్డులు తీసుకుంటున్నాం. మెంటల్ సిక్‌నెస్ అతిపెద్ద సమస్యగా తయారైంది. సోషల్ మీడియా వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. విలువైన సమయం వృథా చేసుకుంటున్నారు. నేటి యువత యోగా, ధ్యానం అలవరచుకోవాలి. 60 ఏళ్లు దాటాక సమాజం కోసం పని చేయాలి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. నైపుణ్యాలు పెంచుకోవాలి. నియంత్రణ లేకుంటే ఏ టెక్నాలజీ అయినా ప్రమాదమే. ప్రతి ఒక్కరూ జీవితాన్ని సరిగా ప్లాన్ చేసుకోవాలి. జనాభా తగ్గిపోతే అనుకున్న లక్ష్యాలు సాధించలేం. 2040కే స్వర్ణాంధ్ర సాధించుకునే సత్తా మనకుంది' అని చంద్రబాబు అన్నారు.
