సంబంధిత వార్తలు
- Thaman: ప్రజలు హ్యాపీగా వుండేందుకే ఓజీ టూర్ చేస్తున్నాం : థమన్
- చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో
- Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
- Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ
- Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం
కేశినేని బ్రదర్స్ గొడవ : తమ్ముడు ఫిర్యాదుతో అన్నపై కేసు
విజయవాడలో కేశినేని బ్రదర్స్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టీడీపీలో ఉన్నపుడు విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. ఆ పిమ్మట ఆయన వైకాపా పంచన చేరడంతో ఆ స్థానంలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి టీడీపీ టిక్కెట్ కేటాయించడంతో అన్నపై గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, ఈ అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కేశినేని నానితోపాటు అతని అనుచరులు సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'గత ఏడాది ఏప్రిల్ 22న కేశినేని నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాస్తూ నాపై పలు అసత్య ఆరోపణలు చేశారు. ఉర్సా సంస్థతో నాకు సంబంధాలున్నట్లు, బినామీల ద్వారా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయమై గత ఏడాది ఏప్రిల్ 24న లీగల్ నోటీస్ పంపినా.. తగిన వివరణ ఇవ్వలేదు.
పదేపదే నాపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులు ఇచ్చినా వాటిని తొలగించలేదు. ఆరోపణలను ఉపసంహరించుకోలేదు. నా రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి' అని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేశినేని శ్రీనివాస్ (నాని)తో పాటు అతని అనుచరులపై ఐటీ చట్టంలోని 66, 66-సీ, 66-డీ, 67, 72 సెక్షన్‌లతో పాటు బీఎన్‌ఎస్‌లోని 204, 351(1), 352, 353(1), 61(1), 356(1) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నాని పీఏగా వ్యవహరించిన హేమంత్‌ను శనివారం పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
