1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. We Transformed Rayalaseema into Rathanala Seema, says ap cm chandrababu naidu

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

chandrababu naidu
రాళ్లసీమగా పేరుగాంచిన రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యతను ఎన్డీయే తీసుకుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.
 
'పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారు. తన బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయులకు గర్వకారణం. కర్నూలు జిల్లాలో డ్రోన్‌ సిటీ ద్వారా భారతదేశంలోనే ఆధునిక డ్రోన్‌ ఎకో సిస్టమ్‌కు శ్రీకారం చుట్టాం. రూ.686 కోట్లతో 8 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. ఒకానోక దశలో అనంతపురం ఎడారిగా మారిపోయింది.  రాయలసీమ రూపు రేఖలు పూర్తిగా మార్చిన ఘనత ఎన్టీఆర్‌ది. సీమకు నీళ్లు తీసుకురావాలి, ప్రజల జీవితాలను మార్చాలని ఎన్టీఆర్‌ సంకల్పించారు. 
 
ఆయన శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. సమర్థ నీటి నిర్వహణతో సీమకు జలహారతి ఇచ్చాం.  కేంద్రం సహకారంతో రాయలసీమ రూపు రేఖలు మారబోతున్నాయి.  రాయలసీమను మళ్లీ రతనాలసీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. కడప స్టీల్‌ప్లాంట్‌ పనులు జూన్‌లో ప్రారంభించి 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసి రాయలసీమకు కానుకగా ఇస్తాం. దేశానికి ఏపీ రక్షణకవచంగా నిలబడుతోంది. ఒకప్పుడు గోల్డ్‌ అంటే కేజీఎఫ్‌.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్‌. ఈ ఏడాది జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్‌లో 600 కిలోలు, వచ్చే ఏడాది 1500 కిలోల బంగారం ఉత్పత్తి చేస్తాం. బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ మారబోతోంది' అని సీఎం అన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్