ఆదివారం, 8 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

vidadala rajini
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థించే నిమిత్తం పూజలు చేసేందుకు వెళితే పోలీసులు తమపై కేసులు పెట్టారని వైకాపా మాజీ మంత్రి, మహిళా నేత విడదల రజనీ అంటున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడులో వైకాపా నేతల పర్యటన సమయంలో వివాదం చెలరేగింది. దీంతో విడదల రజనీతో పాటు మొత్తం 21 మంది వైకాపా నేతలపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రజనీ స్పందిస్తూ, అంబటి రాంబాబు, జోగి రమేశ్‌లపై ఒక పథకం ప్రకారమే దాడి చేస్తున్నారని విమర్శించారు. 
 
అంబటి రాంబాబు ఇంటికి వస్తాం.. మళ్లీ కొడతామని ఎమ్మెల్యే మాధవి హెచ్చరిస్తున్నారంటూ రజినీ మండిపడ్డారు. అసలు టీడీపీలో ఆమె పరిస్థితి ఏంటో చూసుకోవాలని సూచించారు. అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తామంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. 
 
చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితో తనపై, తన అనుచరులపై ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దాడి చేయించారని రజనీ ఆరోపించారు. తమపై దాడి చేసి, తమపైనే కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ చట్టాలను చంద్రబాబు తన చేతిలోకి తీసుకున్నారని విమర్శించారు. వైకాపా నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని, మహిళలపై కూడా దాడులకు తెగబడుతున్నారని విడదల రజనీ ఆరోపించారు.