బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2015 (10:45 IST)

రోజమ్మ లేకుండా సభలో కూర్చోలేం : వైఎస్. జగన్ మోహన్ రెడ్డి

తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే. రోజా సభలో లేకుండా కూర్చోలేక పోతున్నామని, అందువల్ల ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించినందుకు రోజాపై ఒక యేడాది పాటు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెల్సిందే. 
 
దీనిపై జగన్ సోమవారం సభలో మరోమారు ప్రస్తావించారు. దీంతో రోజా సస్పెన్షన్‌పై అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితం మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలుత వైసీపీ అధినేత, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ సభ్యురాలిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 
 
రోజాపై సస్పెన్షన్ ఎత్తేయకుంటే తాము సభలో ఉండలేమని జగన్ తేల్చి చెప్పారు. దీనిపై అధికార పక్షం పునరాలోచించకుంటే ఈ సమావేశాలను బాయ్‌కాట్ చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. దీనికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఏకంగా శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేసేసింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌కు నిరసనగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 
 
సభ శీతాకాల సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అంతేకాక స్పీకర్ వారిస్తున్నా వినకుండా ఆయన తన పార్టీ సభ్యులతో కలిసి విసవిసా బయటకు వెళ్లిపోయారు. దీంతో మిగిలిన మూడు రోజుల సమావేశాల్లో ఎలాంటి వాగ్వాదం కనిపించదు. అధికార పక్షం ప్రతిపాదించనున్న బిల్లలు కూడా ఎలాంటి అవరోధం లేకుండానే పాస్ కానున్నాయి.