ఏపీలో మరో 31 కొత్త పర్యాటక కేంద్రాల ఏర్పాటు..!!

Tourism
Ganesh|
FILE
దేశీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 31 పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ టూరిస్ట్ సెంటర్ల ద్వారా లెక్కకుమించి పర్యాటకులు రాష్ట్రంలో సందర్శించగలరని భావిస్తున్నారు.

31 సరికొత్త పర్యాటక కేంద్రాల ఏర్పాటుతోపాటు ఇదివరకే మరో 50 కేంద్రాలలో పర్యాటకులను ఆకర్షించేలా పలు అభివృద్ధి చర్యలను సైతం పర్యాటక శాఖ చేపట్టింది. టెంపుల్ టౌన్స్, బౌద్ధుల పుణ్యక్షేత్రాలు, ప్రాచీన కట్టడాలు, సముద్ర తీరాలు, హిల్ స్టేషన్లు, అటవీ అందాలు, దట్టమైన అడవుల సౌందర్యంతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ పర్యాటకులను ఆకర్షించటంలో ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తోందనే చెప్పవచ్చు.

కాగా.. 2008-2009 సంవత్సరానికిగానూ 127 మిలియన్లకు పైబడిన సంఖ్యలో పర్యాటకులు ఆంధ్ర రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శించినట్లు అధికారిక గణాంకాల ప్రకారం తెలుస్తోంది. దీంతో దేశీయ పర్యాటకులను ఆకర్షించటంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ర్యాంకును సాధించింది. అలాగే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటంలో దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పర్యాకులు సైతం 0.76 మిలియన్ల సంఖ్యలో రాష్ట్రాన్ని సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Araku
FILE
ఇదిలా ఉంటే.. ఆంధ్ర రాష్ట్రంలో పైన చెప్పుకున్న ప్రాంతాలే కాకుండా, మరెన్నో లెక్కకుమించిన పర్యాటక ప్రాంతాలు అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాలను సరైన రీతిలో అభివృద్ధి చేయకపోవటం, తగిన ప్రాచుర్యం కల్పించకపోవటంతో అనామక ప్రాంతాలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికైనా రాష్ట్ర పర్యాటక శాఖ మేల్కొని నిరాదరణకు గురైన ప్రదేశాలను తమ స్వాధీనంలోకి తీసుకుని తగిన విధంగా అభివృద్ధి చేసి, వాటికి పర్యాటక ప్రాంతాల జాబితాలో స్థానం కల్పించినట్లయితే దేశీయ పర్యాటకులతోపాటు, విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించే అవకాశం ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :