కాకతీయుల వైభవానికి ప్రతీక వరంగల్

Munibabu| Last Modified మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (16:21 IST)
అలనాడు ఆంధ్రదేశాన్ని పాలించిన కాకతీయుల వైభవాన్ని కళ్లారా చూడాలంటే వరంగల్ నగరాన్ని ఓసారి దర్శించాల్సిందే. కాకతీయుల కాలంనాటి శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ నగరంలో ఈనాటికీ చెక్కుచెదరిని ఆనాటి విశేషాలు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ జిల్లాగా వెలుగొందుతోన్న వరంగల్‌ జిల్లా కేంద్రంగానే కాక చక్కటి పర్యాటక ప్రదేశంగా కూడా విశిష్టతను కలిగి ఉంది. చరిత్రలో క్రీ.శ. 12-14 శతాబ్ధాల మధ్య పరిపాలన సాగించిన కాకతీయుల రాజ్యానికి ఈ వరంగల్ రాజధాని నగరంగా ఉండేది. ఆ కాలంలో దీనిని ఓరుగల్లు అని వ్యవహరించేవారు.

తమ పరిపాలనా కాలంలో కాకతీయ వంశీయులు వరంగల్ చుట్టుప్రక్కల ఎన్నో రకాలైన కట్టడాలను నిర్మించారు. అలనాటి కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ఆయా కట్టడాలు నేటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను అలరిస్తున్నాయి. వరంగల్ కోట, వేయి స్థంభాల గుడి, రామప్ప దేవాలయం లాంటివి వరంగల్‌లో చూడతగ్గ ప్రదేశాలు

వరంగల్ కోట
ఆ కాలంలో ఓరుగల్లు కోటగా వ్యవహరించబడిన ఈ కోట 13వ శతాబ్ధంలో నిర్మించబడింది. అయితే ప్రస్తుతం ఈ కోట శిధిలావస్థకు చేరుకోవడం విచారకరం. అప్పట్లో ఈ కోట నిర్మాణాన్ని కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసింది. మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మించబడిన ఈ కోట నిర్మాణాన్ని శిధిలాల రూపంలో నేటికీ చూడవచ్చు.

దాదాపు 19 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో నిర్మించబడిన ఈ కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. వరంగల్ చేరుకున్న వెంటనే తక్కువ సమయంలో ఈ కోట వద్దకు చేరుకోవచ్చు.

రామప్ప దేవాలయం
వరంగల్‌ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలంపేట అనే ఊరియందు ఈ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం నిర్మితమై ఉంది. అలనాడు ఈ ఆలయాన్ని నిర్మించిన రామప్ప అనే శిల్పి పేరు మీదే ఈ దేవాలయాన్ని రామప్ప ఆలయంగా పిలుస్తుండడం విశేషం. కాకతీయ వంశానికి చెందిన రేచర్ల రుద్రుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు.
దీనిపై మరింత చదవండి :