కైలాసకోనగా పిలువబడే కైలాసనాథ కోన చిత్తూరు జిల్లాలోని పుత్తూరుకు సమీపంలో నెలకొని ఉంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ నిరంతరం కొండలపై నుంచి జాలువారే జలపాతం. కొండకోనలతో ముచ్చట గొలిపే ఈ కైలాస కోన ఎంతో ఆహ్లాదకరమైన ప్రాంతం. భక్తులకు కనువిందుచేసే ఎత్తైన పచ్చని కొండలు, కోయిల రాగాల ప్రతిధ్వనులు భక్తిపారవశ్యాన్ని నింపుతాయి. గత ఆదివారం మా ఇండియన్ తెలుగు అసోసియేషన్ తరపున రెండు బస్సుల్లో కార్తీకమాసం సందర్భంగా కైలాసకోన యాత్ర సాగింది. చెన్నై మహానగరంలోని ప్రముఖ వ్యక్తుల దగ్గర్నుంచి పాత్రికేయులు ఇలా.. వివిధ వృత్తులకు సంబంధించిన మొత్తం 70 మందికి పైగా యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రకు రవాణా సౌకర్యాన్ని మద్రాస్ హైకోర్టు గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ అడ్వకేట్ కె. రవీంద్రనాథ్ చౌదరిగారు ఏర్పాటు చేశారు.