కొండవీడు మనదేరా... "కొండపల్లి" మనదేరా...!!

Ganesh|
FILE

"కొండవీడు మందేరా ... కొండపల్లి మందేరా
కాదనువాడుంటే ... కటకందాకా మందేరా...!"

అంటూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీరత్వం ఒలికించే ఈ పాటకు నెలవైన "కొండపల్లి కోట"ను కలిగి ఉన్న గ్రామమే "కొండపల్లి". కొండపల్లి అంటేనే కొండపల్లి కొయ్య బొమ్మలతోపాటు కొండపల్లి దుర్గం కూడా గుర్తు రావడం సహజం. అయితే కంటే, కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయన్నది అందరికీ తెలిసిందే...!

అదలా ఉంచితే పైన చెప్పుకున్న పాట వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేంటంటే... శ్రీకృష్ణ దేవరాయలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శకునం చూడటం ఆయనకు అలవాటు. కటకంపై యుద్ధానికి వెళుతూ శకునం చూడమని మంత్రి తిమ్మరుసుని పంపించాడట. తిమ్మరసు ఓ రజకవాడలోంచి వెళ్తుంటే, ఓ చాకలివాడు "కొండవీడు మందేరా, కొండపల్లి మందేరా, కాదనువాడుంటే, కటకందాకా మందేరా...!" అని పాడుతున్నాడట. ఇంకేముంది శకునం బాగుందని తిమ్మరుసు రాయలవారిని యుద్ధానికి పంపించారట.

ఇక కొండపల్లి కోట సంగతి కొస్తే... కృష్ణా జిల్లా, ఇబ్రహీం పట్టణం మండలానికి చెందిన కొండపల్లి గ్రామంలో నెలవైనదే "కొండపల్లి కోట లేక దుర్గం". దీనిని కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తరువాత 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్రయాత్రలో భాగంగా ఉదయగిరిపై విజయం సాధించి.. ఉదయగిరితోపాటు కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నాగార్జున సాగర్, బెల్లంకొండ, కగిరి దుర్గాలను సైతం వశపరచుకున్నాడు.

అలా రాయలవారి అధీనంలోకి వచ్చిన కొండపల్లి కోట...ఆ కాలంలో శత్రు దుర్భేద్యమైన కోటగా ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో ఇప్పటికీ మూతంస్తుల రాతిబురుజు ఉంది. అలాగే రాయలవారి కాలంనాటి ఏనుగుశాల, భోజన శాలలు కూడా చూడదగ్గవి. సుమారు 18 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న కోట కార్తీక మాసంలో సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

కొండపల్లి కోట కృష్ణదేవరాయల పాలన తరువాత ఎన్నో రాజ వంశాల పాలనలో కొనసాగింది. అంతేకాకుండా, అది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. ఇక్కడి విరూపాక్ష దేవాలయం వనవిహారానికి చాలా అనువుగా ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :