జైన దేవాలయం కొలనుపాక... చూసొద్దాం రండి

Munibabu| Last Modified మంగళవారం, 10 మార్చి 2009 (17:22 IST)
దేశంలో జైన దేవాలయాలకు ప్రముఖమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నా మన రాష్ట్రంలోనూ ఓ ప్రముఖమైన జైన దేవాలయం ఉంది. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ప్రముఖ జైన దేవాలయంగా గత కొన్నేళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దాదాపు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రదేశం కొత్త రూపం సంతరించుకోవడంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతోపాటు నేడు ప్రముఖ పర్యాటక క్షేత్రంగా విలసిల్లుతోంది. దాదాపు వందేళ్ల క్రితం కనుగొనబడిన కొలునుపాక జైన దేవాలయం ప్రస్తుతం కొత్తరూపు సంతరించుకుంది.

కొలనుపాక చరిత్ర
దాదాపు 9వ శతాబ్ధంలో రాష్ట్రకూటుల పాలనలో కొలనుపాక ప్రాముఖ్యం పెరిగింది. అప్పట్లో ప్రముఖ జైన క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు ఆరోజుల్లో సైన్యాగారంగా మార్చడంతోపాటు ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అటుపై ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు సైతం ఈ ప్రాంతంపై శ్రద్ధ కనబర్చడంతో ఇక్కడ అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంది. వీరి కాలంలోనే ఇక్కడ అన్ని రకాల కట్టడాలు నిర్మించబడ్డాయి.

అయితే ఆ తర్వాత చోళులు, పల్లవులు జైనులపై దాడులు ప్రారంభించడంతో ఈ ప్రాంతంతో పాటు ఇక్కడి ఆలయం సైతం దాదాపుగా ధ్వంసమైంది. అటుపై ఈ ప్రాతం కాలగర్భంలో కలిసిపోయింది.

కొలనుపాక పునరుద్ధరణ
దాదాపు వందేళ్ల క్రితం కొలునుపాక ఆలయం వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఈ ప్రాంత విశిష్టత సైతం అందరికీ తెలిసివచ్చింది. అయితే ఈ ప్రాంతం మాత్రం గత 20ఏళ్ల వరకు ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఈ క్రమంలో దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి మాత్రమే ఈ ప్రాతం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. రాజస్థాన్, గుజరాత్‌లాంటి రాష్ట్రాలకు చెందిన జైనులు ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించడంతో ఈ ప్రాతంలో నిర్మాణాలు ఊపందుకున్నాయి.
దీనిపై మరింత చదవండి :