రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఖ్యాతిని పొందిన కృష్ణాజిల్లాకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగంలో విశిష్ఠ స్థానం వుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పేరు చెప్పగానే నోరూరించే ‘బందరు లడ్డు’ గుర్తుకు వస్తుంది. గతకాలపు రాచరిక వైభవాలకు తీపి గుర్తుగా కొండపల్లి ఖిల్లా ఉండవల్లి గుహలు, విజయవాడలోని మొగల్రాజపురం గుహలు, అక్కన్నమాదన్న గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. విజయవాడకు వచ్చిన ప్రతి ఒక్కరు దుర్గమ్మను దర్శనం చేసుకుని ప్రకాశం బ్యారేజ్ పైనుంచి కృష్ణానదిని చూసి తరిస్తారు. తమ పర్యటన పదికాలాలపాటు పదిలంగా గుర్తు ఉండిపోయేందుకు ‘కొండపల్లి’ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు. విభిన్న రంగులతో మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే కొండపల్లి బొమ్మలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.