ప్రకృతి అందాల నిలయం బొర్రా గుహలు

Munibabu| Last Modified బుధవారం, 16 జులై 2008 (19:27 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో బొర్రా గుహలు కూడా స్థానం సంపాదించాయి. కోస్తా ప్రాంతమైన విశాఖపట్నానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహలు తూర్పు కనుమల్లోని అనంతగిరి మండల ప్రాంతంలో ఉన్నాయి. ప్రకృతిచే సహజసిద్దంగా ఏర్పడ్డ ఈ గుహలు లక్షల ఏళ్ల క్రితం ఏర్పడడం విశేషం.

నీటి ప్రవాహం వల్ల రాళ్లు కరిగి ఈ సహజసిద్ధమైన గుహలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఏది ఏమైనా అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా బొర్రా గుహల అందాలు చూచి తీరాల్సిందే.

బొర్రా గుహల విశేషాలు
బొర్రా గుహల ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామస్థులు వీటిని దేవుని నివాసంగా భావిస్తుంటారు. గుహల్లో ఉన్న కొన్ని ఆకారాలు చూడడానికి వివిధ దేవుళ్ల రూపంలో ఉండడం వల్ల ప్రజలు వీటిని ఆశ్చర్యంతో పాటు భక్తితోనూ చూస్తుంటారు. ప్రస్తుతం ఈ బొర్రా గుహల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అభివృద్ధి చేయడంతో ఈ గుహలు మరింత శోభను సంతరించుకున్నాయి.

బొర్రా గుహల్లోపల దాదాపు ఒక్క కిలోమీటరు వరకు దారి ఉండడం విశేషం. ఈ దారి తిన్నగా గోస్తా అని పిలవబడే నదివద్దకు చేరుతుంది. కానీ పర్యాటకులు ఇంతదూరం ప్రయాణించడానికి అనుమతి లేదు.

అయితే గుహల లోపలి ప్రాంతంలో గోచరించే వివిధ ఆకృతులను కరెంట్ దీపాలతో అలకరించడం ద్వారా పర్యాటకశాఖ వీటిని మరింత అందంగా తీర్చి దిద్దింది. దీపాల కాంతిలో ఈ రూపాలను చూడడం ఓ మర్చిపోలేని అనుభూతి.

బొర్రా గుహల సందర్శనకు మార్గం
బొర్రా గుహలను సందర్శించాలంటే విశాఖ నుంచి రైలు, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అరకులోయకు వెళ్లే మార్గంలో ఉండే ఈ గుహలను సందర్శించడానికి చేసే ప్రయాణం సైతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మొత్తం కొండ ప్రాంతాలు, లోయలు విస్తరించిన ఈ మార్గంలో రైలు, బస్సు ద్వారా ప్రయాణిస్తుంటే అద్భుతమైన ప్రకృతి మనముందు సాక్షాత్కరిస్తుంది.


దీనిపై మరింత చదవండి :