మంచుదుప్పటి కప్పేసినా.. కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం..!!

Araku
Ganesh|
FILE
శీతాకాలం వచ్చిందంటే.. చల్లని గాలులు, పచ్చని పొలాలపై మంచుపరదాలు, సంక్రాంతి ముగ్గులు ఇవే అందరికీ గుర్తుకొస్తాయి. మంచు పరదాలను చీల్చుకుని వచ్చే సూర్యకిరణాలు భూమిని తాకుతుంటే ఆ అందానికి సాటి వేరే ఏముంటుంది. గజ గజా వణికిస్తున్న చలి, మంచు దుప్పటి కప్పేసిన ప్రకృతి, వర్షంలా కురుస్తున్న మంచు, కాశ్మీర్‌ను తలదన్నే ప్రకృతి అందాలను ఆరబోసే బోలెడన్ని ప్రాంతాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే బోలెడన్ని ఉన్నాయి.

పచ్చనిటోపీలు ధరించినట్లుగా ఠీవిగా నిలుచున్న పర్వతాలు, మెలికలు తిరిగే రహదారులు, గలగలమని ప్రవహించే సేలయేళ్ళు, చేతికందేంత దూరంలో నీలిమేఘాలు, సాగర తీరాలు, వెరసి కనువిందుచేసే ప్రకృతి ఒడి....ఇలాంటి ప్రాంతాలు కూడా మన రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. మరి వాటన్నింటినీ ఓసారి అలా చూసొద్దామా..?

జలజలా రాలుతున్న మంచుతో పచ్చగా కళకళలాడే పంటపొలాలు.. పచ్చటి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, కనువిందు చేసే ప్రకృతితో ఎవరినా ఇట్టే కట్టిపడేసే ప్రాంతం ఆంధ్రా ఊటీ "అరకు". ఉదయాన్నే ఈ ప్రాంతంలో సందర్శిస్తే, జీవితకాలం సరిపడే తీపి అనుభూతులను గుండెనిండా పదిలం చేసుకోవచ్చు. అయితే మంచు పడుతుండగా, చలిలో తిరగటం కాస్త కష్టమైనా కనువిందు చేసే ప్రకృతి అందాలను చూస్తే మాత్రం, చలిగిలిని మర్చిపోయి ప్రకృతిలో లీనమైపోతారు.

Borra
FILE
సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున ఉన్న అరకులోయ అందాలను చూసి ఆస్వాదించవలసిందే తప్ప మాటల్లో చెప్పలేనిది. అరకు వెళ్లేందుకు బస్సు, ప్రైవేట్ వాహనాల్లో కంటే రైలు ప్రయాణమే ఉత్తమం. ఎందుకంటే, ఈ రైలు ప్రయాణమే ఓ అద్భుతమైన అనుభవంగా మిగిలిపోతుంది. సొరంగాలను దాటుతున్నప్పుడు వెలుగునీడలతో దోబూచులాడుతూ జలపాతాలను పలకరిస్తూ ఆ ప్రయాణం సాగుతుంది.

పొగమంచు, హాయిగా చేతులు చాచి ఆహ్వానిస్తుండే పర్వత పంక్తులను చూస్తూ సాగే ఆ ప్రయాణం చాలాకాలం గుర్తుంటుంది. ఇంకా ఇక్కడ గిరిజన మ్యూజియం, బొర్రా గుహలు, చాప్‌రాయ్ ప్రవాహం, కొండవాలులో పచ్చగా మెరిసే వలిసె పువ్వుల తోటలు, అమాయక గిరిజన ప్రజలు, ఎటుచూసినా కనిపించే పనసచెట్లు, కాఫీ తోటలు.. లాంటివన్నీ తప్పక చూసితీరాల్సినవే.


దీనిపై మరింత చదవండి :