మనసుదోచే రాజధాని అందాలు

Hanumantha Reddy| Last Modified సోమవారం, 26 సెప్టెంబరు 2011 (19:07 IST)
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ అనేక పర్యాటక ప్రదేశాలతో నిత్యం పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో కేవలం పాలనాపరమైన భవనాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా మరెన్నో పర్యాటక ప్రదేశాలను కలిగి వుంది.

హైదరాబాద్‌లో చూడదగిన చూచి తీరాల్సిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ అనగానే చటుక్కున్న గుర్తొచ్చే చార్మినార్ మొదలుకుని ఇక్కడ మరెన్నో అద్భుతమైన సందర్శక స్థలాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వాటిని కింద వివరిస్తున్నాం.

చార్మినార్
హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ఓ అద్భతమైన కట్టడం. 1591లో మహ్మద్ కులీ కుతుబ్‌ షా నిర్మించిన ఈ నాలుగు స్థంబాల కట్టడం చూచి తీరాల్సిన ఓ అద్భుత ప్రదేశం. హైదరాబాద్‌లో ఉన్న ప్రాచీన కట్టడాల్లో ఒకటిగా ఇది నిలిచి ఉంది. ఆనాటి శిల్పుల ప్రావీణ్యానికి గుర్తుగా ఈ కట్టడాన్ని పేర్కొనవచ్చు.

కోట
హైదరాబాద్ నుంచి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం హైదరాబాద్‌లో చూడాల్సినవాటిలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎత్తైన కొండపై కట్టబడిన ఈ కోట ప్రస్తుతం శిధిలావస్థలో ఉంది. అయితే దీని ప్రాంగణంలో పర్యాటకశాఖ అభివృద్ధి చేసిన పార్కు కోటలో ఇంకా మిగిలి ఉన్న ఆనాటి జ్ఞాపకాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పూర్వము హైదరాబాద్‌ను పాలించిన వివిధ వంశాల రాజులకు ఇది రాజధానిగా ఉండేది.

హుస్సేన్ సాగర్
నగరాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌లుగా వేరుచేస్తుంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో నగరప్రజల అవసరాల కోసం నిర్మించబడిన ఈ మానవ నిర్మిత సరస్సు హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరో పర్యాటక ప్రదేశం. ఈ హుస్సేన్ సాగర్ మధ్యలో ఏర్పాటు చేయబడిన బుద్ధుని విగ్రహం నగరానికే కొత్త శోభ చేకూరుస్తోంది. ఈ హుస్సేన్ సాగర్ గట్టుగా ఉన్న టాంక్‌బండ్ అనేది పర్యాటకులు విహరించడానికి ఉపయోగపడుతుంది.


బిర్లా మందిరం
వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ ఆలయం హైదరాబాద్‌లో పర్యాటకులను ఆకర్షించే ఓ ముఖ్యమైన ఆలయం. మామూలుగా కన్పించే వేంకటేశ్వరుని ఆలయాలతో పోలిస్తే దీని నిర్మాణం కాస్త వైవిధ్యంగా ఉంటుంది.

శిల్పారామం
హైదరాబాద్‌లో పర్యాటకులు చూడాల్సిన మరో ప్రదేశం. ఇక్కడ హస్త కళలకు సంబంధించిన సంతలు నిర్వహిస్తుంటారు. ఇదో విస్తరించబడిన సుందరమైన పార్కులాంటి ప్రదేశం. ఇది రాష్ట్ర టూరిజం శాఖవారిచే నిర్వహించబడుతోంది.

ఇస్కాన్ దేవాలయం
అబీడ్స్ రోడ్డులో ఉండే ఈ కృష్ణుడి ఆలయం బహు సుందరంగా నిర్మించబడి ఉంది. పర్యాటకులు చూడాల్సిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

రామోజీ ఫిల్మ్ సిటీ
సినిమా షూటింగుల కోసం నిర్మించబడిన ఓ అద్భుత ప్రదేశం. ఇందులో షూటింగ్ నిర్వహించడానికే కాక పర్యాటకులు విహరించేందుకు కూడా అవకాశం ఉంది.

ఇందులో ఉన్న అద్భుతమైన కట్టడాలు, ఆధునీకతకు అద్దం పట్టే వివిధ సౌకర్యాలు పర్యాటకుల మనసు దోస్తాయి. పర్యాటకుల కోసం వివిధ ప్యాకేజీల ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే ఇందులో వివహరించాలంటే కాస్త ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

పైన పేర్కొన్న విధంగా రాజధాని హైదరాబాద్‌లో పర్యాటక ప్రదేశాలకు ఏమాత్రం కొదవలేదు. హైదరాబాద్ వెళ్లినపుడు మీ వీలును బట్టి ఓ రెండు రోజులు అక్కడే ఉండి చూడగల్గితే రాజధాని అందాలు మీ మనసును దోస్తాయి.


దీనిపై మరింత చదవండి :