మహావిష్ణువు నారసింహుడిగా దర్శనమిచ్చే "అహోబిలం"

Lakshmi Narashimha
Ganesh|
FILE
హిరణ్యకశిపుడిని సంహరించిన శ్రీ మహా విష్ణువు "అహోబిలం" పుణ్యక్షేత్రంలో నారసింహుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. ఆంధ్రప్ర్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డలో నెలకొన్న ఈ ఆలయం నంద్యాలకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా పేరొందిన అహోబిలంను "సింగవేల్ కుండ్రం" అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా కలదు.

శేష పర్వతంగా భావించే నల్లమల పర్వత సానువులను.. ఆదిశేషుని శిరోభాగం శృంగేరి, మధ్య భాగం వేదగిరి, అగ్రభాగం గరుడగిరిగా పెద్దలు చెబుతుంటారు. అందుకనే ప్రహ్లాదుని కరుణించిన ఈ స్వామివారిని దర్శిస్తే సకల అభీష్టాలు, శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. అహోబిలం రెండు భాగాలుగా ఉంటుంది. పర్వతంపైనగల భాగాన్ని "ఎగువ అహోబిలమ"నీ, పర్వతం క్రింద ఉండే భాగాన్ని "దిగువ అహోబిలం" భక్తులు పిలుస్తుంటారు.

ఎగువ అహోబిలంలో అహోబలేశ్వర ఆలయం ఉంది. తొమ్మది కిలోమీటర్ల ఎత్తులో ఉండే పర్వతంపై ఈ ఆలయం నెలకొని ఉంది. దీంతో ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఎన్నో జలపాతాలు, పచ్చని ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. గుండ్రని రాళ్ళతోనిండిన ఎగువ అహోబిలంలో ఎన్నో మండలాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో ఉన్న కోనేటిలో నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఈ నీటిని ఆ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు తాగునీరుగా సరఫరా అవుతుంటుంది. అహోబలేశ్వర ఆలయంలోని స్వామివారికి అర్చన నిమిత్తం పెంచే పూల తోటల కోసం ప్రధానంగా ఈ నీటిని వాడుతుంటారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఈ ప్రాంతం హిరణ్యకశిపుడనే రాజు పరిపాలించిన ప్రాంతం. స్తంభాన్ని చీల్చుకుని భీకర రూపంలో నారసింహుడు దుష్టుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన దివ్య ప్రదేశం ఇదే.

ఎగువ అహోబిలంలోని అహోబలేశ్వర ఆలయం హంపి శిల్పకళా రీతిలో అలరారుతోంది. 1953 వరకు ఇక్కడ ఎన్నో చెంచు కుటుంబాలు నివాసం ఉండేవి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయ ప్రసాదాలను, భక్తులు తెచ్చిన వివిధ రకాల ఫలాలను నారసింహుడికి నివేదన చేస్తారు. నారసింహ జయంతిని, చెంచులక్ష్మితో ఆయన కళ్యాణాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున, అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఇక రెండోది దిగువ అహోబిలం. ఇక్కడ ప్రహ్లాద వరద నారసింహ ఆలయం ఉంది. విజయనగర రాజుల శిల్పశైలితో మూడు ప్రాకారాల మధ్యలో వెలసిన ఈ ఆలయం వీక్షుకుల్ని విశేషంగా ఆకట్టుకుని తన్మయత్వంలో ముంచెత్తుతుంది. ఆలయ సమీపంలోని ఆళ్వారు కోనేరు వద్ద ఎగువ, దిగువ అహోబిలాల ఆలయాల్లో పనిచేసే అర్చకులు నివాసం ఉంటారు. ఇక్కడ భక్తుల వసతికోసం ఎన్నో మండపాలను నిర్మించారు.

దిగువ అహోబిలంలో సహజ శిలలో నరసింహుడు కొలువైయున్నాడు. స్తంభాలపై అద్భుత శిల్పకళా సౌందర్యంతో దిగువ ఆలయంలో ముఖమండపం, ప్రధాన ఆలయం, రంగమండపం, కనువిందు చేస్తాయి. రంగమండపంలో గుర్రాలపై ఎక్కిఉన్న యక్షులు, విజయనగర శిల్పకళా వైభవంతో అలరారే వివిధ వాద్యకారులు, అతివలు, రామలక్ష్మణుల శిల్పాలు, నరసనాయక విగ్రహాలు శోభాయమానంగా కనిపిస్తాయి.


దీనిపై మరింత చదవండి :