మున్నార్‌, అలెప్పీలో ఆనందాల "హనీమూన్ హోంస్టే"

Munnar
Ganesh|
FILE
సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో ముగ్ధ మనోహర దృశ్యాలతో శోభిల్లే అందమైన సముద్ర తీరాలు, సెలయేటి గలగలలు, టీ తోటల సుమధుర పరిమళాలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మనసును అబ్బురపరిచేదే. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఇదో ప్రేమ సామ్రాజ్యమంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి హోంస్టేలు హనీమూన్ జంటలకు ఓ మన్మధ సామ్రాజ్యాన్ని సృష్టించి బహూకరిస్తుంటాయి. ఎటుచూసినా పచ్చదనంతో మనసును దోచుకునే ఇలాంటి ఆనందాలను తనివితీరా దర్శించాలంటే భూతల స్వర్గం కేరళను దర్శించాల్సిందే.

"కేర" అంటే సంస్కృత భాషలో కొబ్బరి చెట్టు అని అర్థం. అలాంటి కొబ్బరి చెట్లతో నిండిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని "కేరళ" అని పిలుస్తుంటారు. కేరళలో హనీమూన్ జంటల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న హోంస్టేలలో విహారానికి వచ్చిన సందర్శకులకు సాదర స్వాగతం లభిస్తుంది. హోంస్టే అంటే అచ్చంగా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించే ప్రదేశమని చెప్పవచ్చు. లాడ్జీలు, హోటల్స్ కంటే ఈ హోంస్టేలు సొంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగిస్తూ గౌరవ ఆతిథ్యాన్ని అందిస్తాయి.

మరీ ముఖ్యంగా హనీమూన్ జంటలకు హోంస్టేలు చాలా సంతృప్తిని కలిగిస్తాయి. ఈ హోంస్టేలు నగర వాతావరణానికి దూరంగా నిర్మించటంవల్ల అక్కడ ఆతిథ్యంపొందే జంటలకు అచ్చంగా ఇంట్లోనే ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తాయి. సముద్రం ఒడ్డున, సెలయేళ్ల నడుమ, హిల్‌స్టేషన్ అయిన మున్నార్ ఎస్టేట్‌, ప్లాంటేషన్ బంగళాలు.. తదితర ప్రాంతాలలో ఈ హోంస్టేలను నిర్మించారు.

సాయం సందెవేళల్లో సూర్య కిరణాలు నారింజ రంగులో మురిపిస్తుంటే.. అక్కడి టీ తోటల్లో విహరిస్తూ, ప్రకృతిలో మమేకమై.. ఒకరికి ఒకరై ఆనందాలను అనుభవించటం ఏ జంటకైనా ఓ మరపురాని అనుభూతే కదూ..! ఈ అనుభూతులను నిజం చేస్తాయి కేరళలోని హోం స్టేలు. హనీమూన్ ప్యాకేజీలలో భాగంగా ఈ హోంస్టేలను సందర్శించవచ్చు.

హనీమూన్ ప్యాకేజీలలో భాగంగా మున్నార్, అలెప్పీలలో 4 రాత్రులు ఆనందంగా గడిపేందుకు కేవలం ఓ 14 లేదా 15 వేల రూపాయలను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్యాకేజీలో మున్నార్ వద్దగల రేంజర్ ఉడ్స్ హోంస్టేలో రెండు రాత్రులపాటు భోజన సదుపాయాలతోపాటు ఆతిథ్యం పొందవచ్చు. అలాగే అక్కడ ఉన్న టీ తోటలమధ్య నూతన జంటలు రెక్కలు కట్టుకుని విహరించవచ్చు. మున్నార్ టౌన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో గల పోతమేడులో ఈ రేంజర్ ఉడ్స్‌లో వేడినీటి సౌకర్యంతోపాటు, శాటిలైట్ టీవీ, ఇన్‌హౌస్ లాండ్రీ లాంటి సదుపాయాలెన్నో లభిస్తాయి.


దీనిపై మరింత చదవండి :