రమణీయ శిల్పకళా నిలయం "రామప్ప దేవాలయం"

Ganesh|
FILE
ఇక్కడ అడుగుపెట్టగానే శిల్పాలు నాట్యం చేస్తున్నట్లుగా.. శిలలు సప్త స్వరాలను ఆలాపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎత్తయిన గుట్టలు, దట్టమైన అడవి, విశాలమైన సరస్సు, ఆ సరస్సు ఒడ్డున విలసిల్లుతున్న ఈ అద్భుత కళాఖండాన్ని చూడగానే రస హృదయాలు పరవశించిపోతాయి. ఇంతటి అపురూప రమణీయ శిల్ప కళాఖండం.. కాకతీయుల రాజధాని వరంగల్ జిల్లా కేంద్రానికి సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలోని రామప్పలో విరాజిల్లుతోంది.

వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజన్‌లోని వెంకటాపురం మండలం, అనే గ్రామంలో వెలసిన ఈ రామప్ప దేవాలయం ప్రపంచ పర్యాటకులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. శిల్పుల అసాధారణ ప్రజ్ఞ, సూక్ష్మ పరిశీలనా సౌందర్యం ఈ ఆలయం అణువణువునా తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో జాతర వైభవంగా జరుగుతుంది.

ఈ జాతర సమయంలో శోభాయమానంగా కనిపించే రామప్ప ఆలయ సౌందర్యాన్ని వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధానమైన రుద్రేశ్వరాలయంతోపాటు, కోటేశ్వరాలయం, కళ్యాణ, నంది మండపాలను చతురస్రాకార ప్రాంగణంలో అపురూపమైన కళారూపాలతో అందంగా కట్టించారు.
నాగిని సజీవ సౌందర్యం..!
ఆలయంలోని శిల్పకళా ఖండాలన్నింటికీ తలమానికం లాంటిది నాగిని శిల్పం. సౌందర్యానికి ప్రతీక అయిన ఈ శిలా ప్రతిమలో 700 ఏళ్లు గడిచినా జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. నాగిని చేతిలో ఒక సర్పం, మెడలో మరో సర్పం పడగను ఎడమవైపుగా తిప్పి.. ఆమె దక్షిణ భుజాన్ని...


ఆలయ చరిత్రను చూస్తే.. కాకతీయ శాసనాలనుబట్టి రామప్ప దేవాలయ నిర్మాణం.. శాలివాహన శకం 1135వ సంవత్సరం నుంచి క్రీస్తుశకం 1213ల వరకు అంటే పదిహేను సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేసినట్లు ఆధారాలున్నాయి. గణపతిదేవుని కాలంలో రమణీయ శిల్పకళా వైభవానికి నిదర్శనమైన ఈ ఆలయాన్ని రేచర్ల వంశీయుడైన రుద్రసేనాని తీర్చిదిద్దాడు. కాకతీయ సామ్రాజ్యానికి ఆత్మీయుడైన ఇతను ఓరుగల్లులో రుద్రేశ్వరాలయాన్ని కూడా కట్టించాడు.

రుద్రదేవుడి పరిపాలనా కాలంలో కుందూరు రాజు తైలవదేవునికి అందాలరాశి అయిన వసుంధర అనే కుమార్తె ఉండేది. ఆమెను వివాహం చేసుకుని కుందూరు రాజ్యాన్ని వశపర్చుకోవాలన్న దుర్భుద్ధితో చోడవంశపు భీమరాజు కుందూరుపై దాడి చేశాడు. తైలవుడిని హతమార్చి వసుంధరను బంధించాడు. ఇలాంటి సమయంలో రుద్రసేనాని యుద్ధంలో భీమరాజుతో తలపడి హతమార్చాడు.

దీంతో వసుంధరను రుద్రసేనానికిచ్చి వివాహం చేస్తాడు రుద్రదేవుడు. రుద్రసేనాని స్వామిభక్తికి మెచ్చిన రుద్రదేవుడు ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడు. అప్పుడు ఆంధ్రుల శిల్పకళ లక్ష్యంగా తానో దేవాలయాన్ని నిర్మించతలపెట్టాననీ.. అందుకు అవసరమయ్యే ధనాన్ని సమకూర్చాలని రుద్రసేనాని అడిగాడు. దానికి అంగీకరించిన రుద్రదేవుడు దానపత్రం రాసి ఇచ్చాడు. రుద్రదేవుడి తరువాత మహదేవరాజు నుంచి గణపతిదేవుడి పరిపాలనా కాలం వరకూ ఈ ఆలయాలు పూర్తి అయినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

రామప్ప దేవాలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పాచార్యుడు రామప్ప. ఆయన పేరుమీదనే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. నక్షత్రాకృతిలో ఉండే వేదికమీద నిర్మించిన ఈ ఆలయం పూర్వాభిముఖంగా ఉంటుంది. పశ్చిమ భాగంలో గర్భగుడి, దాని ముందు చతురస్త్రాకృతిలో ఉండే నాట్యమండపం చుట్టూ చిన్న ప్రాకారం ఉంది.

దక్షిణ తూర్పు దిశలలో ముఖ మండపాలున్నాయి. మహా మండపం మధ్య అందాల శిల్పాల అల్లికలతో శోభిల్లే నాలుగు స్తంభాలున్నాయి. గర్భగుడి ద్వారంపై అష్టకోణాకృతిలో తీర్చిదిద్దిన రాతి పలకలపై అనేక విధాల శిల్ప విన్యాసాలను వినూత్నంగా మలిచారు. రాతి పలకలలో జల్లెడ చిల్లులాగా ఎన్నో రంధ్రాలు కటౌట్ పద్ధతిలో చక్కగా తీర్చిదిద్దినట్లుగా రూపొందించారు.

ప్రధాన రుద్రేశ్వరాలయానికి రెండువైపులా రుద్రసేనాని పేరుతో కోటేశ్వరాలయం, కామేశ్వరాలయం అనే రెండు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను పూర్తిగా ఇసుక రాతితో నిర్మించారు. వాటిలోపల అక్కడక్కడా నల్లరాతి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయాల నిర్మాణం పెద్ద పెద్ద శిలాఫలకాలతోనే జరిగింది. గర్భాలయంలో 18 అడుగుల పొడవుగల ఎత్తయిన శివలింగం దర్శనమిస్తుంది.


దీనిపై మరింత చదవండి :