రాయలవారి స్వర్ణయుగ వైభవ చిహ్నం "చంద్రగిరి"

fort
Ganesh|
FILE
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో "చంద్రగిరి" స్వర్ణయుగ వైభవంతో అలరారింది. రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చెబుతుంటారు. ఆనాటి వైభవాన్ని చాటుతూ ఠీవిగా నిలుచున్న శత్రుదుర్భేద్యమైన "చంద్రగిరి కోట" చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీప దూరంలో ఉన్న చంద్రగిరి వద్ద నిర్మితమైన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.

కార్వేటి నగరాధీశులైన ఉమ్మడి నరసింహరాయులు చంద్రగిరి కోటను తొలుత నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. నరసింహరాయులు నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తుండేవాడు. అయితే నారాయణగిరిలో శత్రుభయం ఎక్కువగా ఉన్నందున తన రాజధానిని చంద్రగిరికి మార్చుకున్నాడు.

నరసింహరాయలు ఒకరోజు తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకుని బయటికి రాగానే.. ఆయన నెత్తిపైనున్న తలపాగాను గద్ద ఒకటి తన్నుకుపోయిందట. దీంతో రాజభటులు గ్రద్ధను వెంబడించగా, అది చంద్రగిరి అడవిదాకా వెళ్లి ఒక ప్రాంతంలో దాన్ని జారవిడిచిందట. తలపాగాను దొరకబుచ్చుకున్న రాజభటులు ఈ విషయాన్నంతా రాజుకు వివరించారట. తన రక్షణకోసం ఒక మంచి కోట నిర్మించేందుకు అనువైన స్థలాన్ని చూపించేందుకు ఆ శ్రీవారే ఇలా చేసి ఉంటారని భావించిన ఆయన అక్కడ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది.
ఉప్పుసట్టి.. పప్పుసట్టి..!
చంద్రగిరి కోటను నిర్మించిన కొండమీద "ఉప్పుసట్టి", "పప్పుసట్టి" అనే కోనేరులు చూడదగ్గ ప్రాంతాలు. అలాగే "దుర్ఘం" అని పిలువబడే ఎత్తైన సన్నటి బండ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆరోజుల్లో తప్పుచేసినవారికి మరణ దండన విధించే ఉరిస్తంభం కూడా అక్కడే...


అలా క్రీస్తు శకం 1000 సంవత్సరంలో నిర్మించబడింది. క్రీస్తు శకం 1486 నుంచి 1489 వరకు శాలువ నరసింహరాయుల పాలనలో చంద్రగిరి కోట ప్రసిద్ధిగాంచింది. రాక్షస-తంగడి యుద్ధం తరువాత విజయనగర రాజులు తమ రాజధానిని హంపీ నుంచి చంద్రగిరికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఆ తరువాత 1584-1614 ప్రాంతంలో అరవీటి వంశపురాజులు, 1645 ప్రాంతంలో గోల్కొండ సుల్తానులు, 1758లో కర్నూలు నవాబు సోదరుడైన అబ్దుల్ నవాబ్‌ఖాన్‌ల అధీనంలో చంద్రగిరి కోట ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎంతోమంది రాజుల పాలనకు సాక్షీభూతంగా నిలిచిన ఈ చంద్రగిరి కోటలో రాజమహల్, రాణిమహల్ అనే రెండు ప్రధాన రాజప్రాసాదాలు ఉన్నాయి.

వీటిలో రాజమహల్ దాదాపు 160 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో 95 అడుగుల ఎత్తుతో అత్యంత సుందరంగా నిర్మించబడింది. ఇంత పెద్ద కోట నిర్మాణంలో ఎక్కడ కూడా కలప వినియోగించక పోవటం ఈ కోట ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ కోటను సున్నం, ఇసుక, పెద్దసైజు రాళ్లను మాత్రమే నిర్మాణంలో ఉపయోగించారు. హిందూ, మహమ్మదీయ వాస్తు రీతులను తలపించే విధంగా ఈ కోట నిర్మాణం జరిగింది.

1988వ సంవత్సరం నుండి రాజమహల్‌లో మ్యూజియంను ప్రారంభించారు. అలాగే పురావస్తు సంగ్రహాలయం పేరుతో రాయలసీమ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో దొరికిన విగ్రహాలను, సామగ్రి ఇందులో భద్రపరిచారు. కోట గోడచుట్టూ అద్భుతమైన ప్రహరీగోడ నిర్మించబడింది. ఈ గోడను పెద్దరాళ్లతో నిర్మించారు.


దీనిపై మరింత చదవండి :