వన్యప్రాణులకూ తప్పని "కరువు" తిప్పలు...!

peacock
Ganesh|
FILE
ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అడవుల్లో హాయిగా సంచరిస్తూ.. అడవులకే వన్నె తెస్తున్న వన్యప్రాణులకు సైతం కరువు తిప్పలు తప్పటం లేదు. వర్షాల లేమి మానవులకేకాక, వన్యప్రాణుల మనుగడకు కూడా శాపంగా మారిందనే చెప్పవచ్చు. నీటికోసం పరితపిస్తూ అటవీ సమీప గ్రామాలకు, నీరు లభ్యమయ్యే ప్రాంతాలకు వస్తున్న వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి.

వరంగల్ జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా దాడులలో భారీ ఎత్తున జంతువుల చర్మాలు దొరకటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. సాధారణ వన్యప్రాణులతోపాటు నీటిలో ఉండే తాబేళ్ల చిప్పలు సైతం వీరి వద్ద లభించటం.. నీటి ఎద్దడి తీవ్రతకు దర్పణం పడుతోందని సాక్షాత్తూ అటవీశాఖే ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంద. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే, జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళనపడుతున్నారు.

ఇదిలా ఉంటే... వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల గిరిజనులు, గిరిజనేతరులు వేటకు వెళ్లటం సహజం. ఇలా వేటకు వెళ్లినవారు అక్కడక్కడా నీరు లభించే ప్రాంతాలను కనిపెట్టి పొంచి ఉండి.. నీరు తాగేందుకు వచ్చే వన్యప్రాణులను హతమారుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ జిల్లాలోని తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట, ఏటూరు నాగారం, కొత్తగూడ, గూడూరు, చిట్యాల, మహబూబ్‌నగర్ లాంటి అటవీ ప్రాంతాలలో వన్యప్రాణులు ఇటీవలి కాలంలో నీటి వేటలో దారి తప్పుతున్న ఉదంతాలు అనేకం దర్శనమిస్తున్నాయి. ఇటీవల ఒక అడవిదున్న నీటికోసం గూడూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చి సమీపంలోని వ్యవసాయబావిలో పడిపోయినట్లు తెలుస్తోంది.

కాగా.. దారి తప్పిన వన్యప్రాణులను అటవీశాఖ అధికారులకు అప్పగించేది చాలా కొద్దిమంది మాత్రమేనని, అదను చూసి వేటాడే ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయని... ఆ శాఖ స్వాధీనం చేసుకున్న జంతు చర్మాలే స్పష్టం చేస్తున్నాయి. అయితే అటవీశాఖ అరెస్టు చేసిన వ్యక్తి ఓ గిరిజన రైతు కావడం గమనార్హం. వర్షాలు లేని కారణంగా, వేటకు వెళ్లినట్లు సదరు గిరిజనుడు వాపోయినట్లు తెలుస్తోంది.

ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో రెండు పులులు, వాటితోపాటు అధిక సంఖ్యలో చిరుత పులులున్నట్లు ఇటీవలనే అటవీశాఖ ప్రకటించింది. ఇవేకాకుండా మనుబోతులు, జింకలు, దుప్పులు, అడవిదున్నలు, కొండముచ్చులు తదితర జీవరాశులు కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు మనుషులతోపాటు వనజీవుల్ని సైతం ఆందోళనలో పడవేస్తున్నాయి.

అయితే అటవీశాఖ అధికారులు మాత్రం వన్యప్రాణులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదనీ... ఈ జంతువుల కోసం తాము దట్టమైన అటవీప్రాంతాలలో సాసర్‌వెల్స్ (ఇసుక, రాళ్లతో చిన్న చిన్న కుంటల్ని పోలిన నీటిమడుగులు)ను నిర్మించామనీ, వాటిద్వారా ఈ జంతువులకు నీరు లభ్యమవుతుందని చెబుతున్నారు. ఆ నీటితో అవి నిశ్చింతగా ఉంటాయని వారు భరోసా ఇస్తున్నారు. పాపం వన్యప్రాణుల కష్టాలు ఆ దేవుడే తీర్చాలి మరి...!!


దీనిపై మరింత చదవండి :