విశాఖలో తథాగతుడి "బుద్ధం శరణం గచ్చామి"

FILE

ఒకప్పుడు ఎక్కడో మగధ సామ్రాజ్యంలో "బుద్ధం శరణం గచ్చామి" అని వినిపిస్తే చాలు ఈ పట్టణం పరవశంతో పులకించిపోయేది. వెంటనే "ధర్మం శరణం గచ్చామి" అంటూ తానూ గొంతు కలిపేది. హీనయాన, మహాయాన బౌద్ధ భిక్షువులెందరికో ఆశ్రయం ఇస్తూ... బౌద్ధమత ప్రచారానికి ఆలంబనగా నిలిచింది. బుద్ధదేవుడి భూమికగా కీర్తిస్తున్న ఆ పట్టణం పేరే విశాఖపట్నం.

ఎక్కడి కపిలవస్తు నగరం... మరెక్కడి విశాఖపట్నం. చెట్టుమీది కాయతో సముద్రంలోని ఉప్పుకి బంధం వేస్తాడు భగవంతుడు అని పెద్దలు ఊరకే అన్నారా...? అందుకే బుద్ధభగవానుడు తన సారనాథ్ సందేశంతో వైజాగ్ అని పిలవబడే ఈ విశాఖపట్టణాన్ని అమాంతం పెనవేసుకున్నాడు.

విశాఖలోని భీమిలి నుంచి పాయకరావు పేట వరకూ పరచుకున్న గిరులన్నీ గౌతముని బోధనలకు పట్టుగొమ్మలుగా అలరారాయని నేడు బయల్పడుతున్న అవశేషాల ద్వారా మనకు తెలుస్తోంది. సుమారు వంద సంవత్సరాల క్రితం అంటే 1908లో విశాఖలో తొలిసారిగా తవ్వకాలు జరిగాయి.
ఎక్కడ తవ్వినా ధర్మశాలలే...!
  విశాఖపట్నం జిల్లాలోని ఏ ప్రాంతంలో త్రవ్వినా అక్కడ ఒకనాడు ఆదరణకు పాత్రమైన బౌద్ధ ధర్మశాలలే దర్శనమిస్తున్నాయి. గౌతముడి బోధనలు ఆధ్యాత్మిక వీచికలై ఈ జిల్లాను గొప్ప క్షేత్రంగా నిలిపిన ఘటనలే గోచరమవుతున్నాయి. బౌద్ధ ఆచార్యుల దివ్య సందేశాలను ప్రపంచానికి...      


బ్రిటీష్ అధికారి అలెగ్జాండర్ రే చొరవ తీసుకుని జరిపిన ఈ తవ్వకాల్లో... అమరావతి, భట్టిప్రోలు మాదిరిగా బుద్ధభగవానుడి బోధనలకు విశాఖపట్నం కూడా గొడుగుపట్టినట్లు ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారిగా వెల్లడయ్యింది. అనకాపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సంఘారామం (శంకరం), పల్లెపట్టున బుద్ధన్నకొండ (బొజ్జన కొండ)లను పరిశోధకులు ఈ పరిశోధనల్లో కనుగొన్నారు.

పూజలు అందుకునే ఆకృతులు (స్థూపాలు), బౌద్ధ బిక్షువుల నివాసాలు (విహారాలు), ఆలయాలు (చైత్య గృహాలు), ఇటుకలతో నిలిపిన మరికొన్ని కట్టడాలు ఈ త్రవ్వకాల్లో బయటపడ్డాయి. అలాగే సముద్రగుప్తుడి కాలంనాటి బంగారు నాణెం ఒకటి దొరికింది. పక్కనే ఉన్న లింగాల మెట్టమీద చాళుక్య విష్ణువర్ధనుని కాలంనాటి రాగి నాణాలు, బ్రాహ్మీ లిపిలో, ప్రాకృతంలో రాసిన బుద్ధుడి బోధనల శిలాఫలకాలు కూడా వెలుగుచూశాయి. అలాగే వజ్రయాన శాఖకు చెందిన లోహపు విగ్రహాలు కూడా లభించాయి.

విశాఖపట్నం-భీమునిపట్నం బీచ్ రోడ్డులోని తిమ్మాపురం మెట్ట ప్రాంతం బావి కొండగా ప్రసిద్ధి చెందింది. ఇదంతా కూడా ఒకప్పుడు బౌద్ధుల నివాసమేనని 1991లో జరిగిన త్రవ్వకాలు నిర్ధారించాయి. ఆరామాలు, విహారాల సముదాయం, చైత్యగృహాలు ఎన్నో ఇక్కడ వెలుగు చూశాయి. తొమ్మిది మీటర్ల పొడవుండే ప్రధాన స్థూపం ఒకటి బయటపడింది. దీనికున్న ప్రదక్షణ మార్గం బౌద్ధ వాస్తు శిల్పుల పనితీరును సూచిస్తోంది.

Ganesh|
త్రిశాల పేరుతో బయల్పడిన ఇక్కడి విహారం లెక్కకు మించిన గదులతో అలరారుతూ కనిపిస్తుంది. అగస్తస్ కీజర్, టైబీరియస్, రోమన్ నాణాలు, శాతవాహన కాలంనాటి నాణెమూ ఇక్కడ లభించాయి. ఇక్కడ లభ్యమైన రాతి భరిణెల్లో నాటి బౌద్ధ సన్యాసుల చితాభస్మం, అస్థికలు.. క్రీస్తుపూర్వం నాలుగు, మూడు శతాబ్దాల నాటి అంత్యక్రియల వివరాలను తెలియజేస్తున్నాయి.


దీనిపై మరింత చదవండి :