వైభవం నశించిన విగతజీవి "కనిగిరి దుర్గం"

kanigiiri
Ganesh|
FILE
"రాజులు పోయినా, రాజ్యాలు పోయినా" ఒకనాటి వైభవానికి, దర్పానికి నిదర్శనంగా.. కాలగర్భంలో కలసిపోయిన రాజసానికి సాక్షీభూతంగా నిలిచినదే "కనిగిరి దుర్గం". మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఆనాడు అజేయంగా, అంగరంగ వైభవంగా విలసిల్లిన ఈ కోట.. విజయ మార్తాండ దుర్గంగా, కనకగిరిదుర్గం (బంగారుకొండ)గా ఆ తర్వాత "కనిగిరి దుర్గం"గా రూపుదాల్చింది.

శతాబ్దాల చరిత్ర కలిగిన కనిగిరి దుర్గం... విజయనగర సామ్రాజ్యాధీశులు, గజపతులు, యాదవులు, రెడ్డిరాజులు, రాజ ప్రతిధులు, బహమనీ సుల్తానుల ఏలుబడిలో ఆనాడు ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. అయితే ఇప్పుడు ఆ కోట ఒక అవశేషం మాత్రమే. నేడు ఈ కోటపై కొన్ని చారిత్రక కట్టడములు కలవు. వాటిలో కనిగిరి కోట, బావులు, దుర్గము ముఖ్యమైనవి కాగా.. రెండు జీర్ణావస్థలో ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. కొండపై ఒక చదరపు మైలు వైశ్యాల్యం కలిగిన చదును నేల ఉంది. పూర్వం ఈ కొండపై ఒక పట్టణము ఉండేదని స్థానికుల కథనం

కనిగిరి దుర్గం 1314వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. కాటంరాజు కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడనీ, ఆయన ఏలుబడిలో కడప, కర్నూలు ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా అర్థమవుతోంది. కాటంరాజు పాలనా కాలంలో కనిగిరి ప్రాంతంలో కరువు ఏర్పడిందట. అయితే తనకుండే అపారమైన పశు సంపదను రక్షించుకునే నిమిత్తం ఆయన నెల్లూరు పాలకుడయిన మనుమసిద్ధి రాజుతో పుల్లరి పద్ధతి ఒప్పందాన్ని చేసుకున్నాడట.
రాయల శ్రీమతి స్నానమాడిన కోనేరు..!!
ఈ కోటలో రెండు మంచినీటి చెరువులు, ఒక కోనేరు ఉన్నాయి. కోటి చెన్నమ్మక్క బావిగా కోనేరు ఒకటి వాడుకలో ఉంది. శ్రీకృష్ణదేవరాయులు భార్య రాణి చెన్నమ్మదేవి ఈ కోనేరును నిర్మించినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. బావి సమీపంలో విష్ణు ఆలయం ఉంది. అయితే విష్ణువు...


ఈ ఒప్పందం ప్రకారం పశువులను నెల్లూరులోని పచ్చిక బయళ్ళలో మేపుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా పుల్లరి పద్ధతిలో కాటంరాజు తన పశువులను ఈ ప్రాంతానికి తరలించాడట. అయితే కనిగిరి ప్రాంతంలో కరువు తొలగిన వెంటనే పుల్లరి చెల్లించేందుకు నిరాకరించిన కాటంరాజు.. తన పశువులను కనిగిరికి తరలించకు వచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కాటంరాజుకు చెందిన పశువులలో అత్యంత ప్రాధాన్యం కలిగిన బొల్లి ఆవును ఇవ్వాల్సిందిగా మనుమసిద్ధిరాజు కోడలు కుందుమాదేవి కోరిందట. అయితే దానికి కాటంరాజు తిరస్కరించటంతో ఆగ్రహించిన కుందమదేవి గోవులను చంపించే పనులు చేపట్టడంతో, ఆయన గోవులను కనిగిరికి తీసుకొచ్చేశారని మరో కథనం.

కారణాలు ఏవైనప్పటికీ... కాటంరాజు, మనుమసిద్ధిరాజు యుద్ధానికి తలపడ్డారట. వీరిద్దరూ పాలేటి ఒడ్డున పంచలింగాల కొండవద్ద యుద్దానికి తలపడ్డారట. ఇందుకు సాక్ష్యాలుగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొన్ని చారిత్రక ఆధారాలు దర్శనమిస్తున్నాయి. ఈ యుద్ధంలో కాటంరాజు విజయం సాధించారు. దాంతో యాదవులు వారి కులదేవత అయిన గంగాదేవి ఆలయాన్ని కాటంరాజుచేత ప్రతిష్టింపజేసి భక్తిప్రపత్తులతో పూజలు జరిపారని శాసనాలు చెబుతున్నాయి.

కాటంరాజు శ్రీ కృష్ణభగవానుడి అంశ అని భావించిన యాదవులు కాటంరాజు ధైర్యసాహసాలను నేటికీ కనిగిరి ప్రాంతంలో కథల్లాగా చెప్పటమేగాక.. గంగాదేవి వెనుకవైపున కాటంరాజు విగ్రహాలు ఉంచి పూజిస్తుంటారు కూడా..! అప్పటి కాటంరాజు పాలనా కాలంనాటి శిల్పాలు, విగ్రహాలు, కాటంరాజు గుడి.. తదితరాలు నేటి కనిగిరి దుర్గంలో శిథిలావస్థకు చేరుకుని మనకు దర్శనమిస్తున్నాయి.

కాటంరాజు తర్వాతి కాలంలో ఉదయగిరిని పరిపాలించిన గజపతుల ఆధీనంలోకి వెళ్లిన ఎంతగానో అభివృద్ధి చెంది, సరికొత్త నిర్మాణాలతో ముస్తాబయనట్లు పలు చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. అయితే 1520లలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్రయాత్రలో భాగంగా సుమారు 2 లక్షల సైన్యంతో ఉదయగిరి దుర్గాన్ని చుట్టుముట్టి 18 నెలలపాటు పోరాడి ఎట్టకేలకు విజయం సాధించాడు.

ఆ విజయంలో భాగంగా కృష్ణదేవరాయలు ఉదయగిరితోపాటు కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నాగార్జునసాగర్ కొండ, బెల్లంకొండ, కనిగిరి దుర్గాలను వశపరచుకున్నాడు. రాయల పాలన అనంతరం విజయనగర సామ్రాజ్య వైభవం పతనావస్థకు చేరుకోసాగింది. విజయనగర రాజుల తర్వాత కనిగిరి దుర్గం రెడ్డి రాజులు, రాజప్రతిధుల పాలనలోకి వెళ్లినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఆ తర్వాత 1972లో మైసుర్ సుల్తాన్ హైదర్ ఆలీ హయాం వచ్చింది. హైదర్ ఆలీ కర్నాటక యుద్దాల్లో పైచేయి సాధించి.. ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు. అయితే అప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్ అధికారం కుడా ప్రారంభమయింది. కనిగిరి ఆనాడు ఆధో నవాబు అయిన బసాలతే ఆధీనంలో ఉంది. అయితే 1776లో హైదర్ ఆలీ ఆధోపై దండెత్తి.. ఆ తర్వాత కనిగిరి దుర్గాన్ని వశపరచుకున్నాడు.


దీనిపై మరింత చదవండి :