గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

అడిగిన వరాలన్నీ ఇచ్చే "అన్నవరం" సత్యదేవుడు..!!

FILE
అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి "అన్నవరం సత్యదేవుడి"గా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతంకంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కార్తీక మాసంలో కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ విశేషాలేంటో అలా చూసి వద్దామా..?!

పురాణాల ప్రకారం అన్నవరంలో వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ చరిత్రను చూస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు బేధం లేదని చాటి చెప్పేందుకే ఇక్కడ వెలసినట్లుగా తెలుస్తోంది. భూలోకంలో పరస్పరం కలహాలతో జీవనం గడుపుతున్న ప్రజలను బాగుచేయమని త్రిలోక సంచారి నారద మహర్షి శ్రీమన్నారాయణుడిని కోరారట.

ఆయన కోరిక మేరకు హరిహర బ్రహ్మ అంశాలతో కూడి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి అనే పేరుతో అన్నవరంలో ఉద్భవించి, మానవులను ఉద్ధరిస్తాననీ శ్రీమన్నారాయణుడు వాగ్దానం చేశారట. అన్నట్లుగానే నారాయణుడు సత్యనారాయణుడిగా అన్నవరంలో స్వయంభువుగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే అంతకుముందు భూలోకంలో ఏ ప్రదేశం తన అవతారానికి తగినదిగా ఉంటుందని ఆలోచించిన నారాయణుడు ఆంధ్రభూమే అందుకు సరైనది నిర్ణయించుకున్నారట. గతంలో తాను ఇచ్చిన వరాలను దృష్టిలో ఉంచుకున్న ఆయన, రత్నగిరికి ఆనుకుని ఉండే పంపానదీ తీరంలోని అన్నవరం గ్రామం అందుకు అనుకూలమైనదని, తన ఆవిర్భావానికి నారాయణుడు నాంది పలికారట.

దీంతో ఏ శుభ సమయంలో రత్నగిరి కొండపై శ్రీమన్నారాయణుడు స్వయంభువుగా సత్యనారాయణుడిగా అవతరించారో.. అదే సమయంలో అన్నవరంలో నివసించే భక్తాగ్రేసరుడు, ఉత్తముడు అయిన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం బహద్దూర్ వారికి కలలో దర్శనమిచ్చారట. ఆ కలలో తన జన్మ వృత్తాంతమును వివరించిన సత్యదేవుడు తనవద్దకు రమ్మని బహదూర్‌ను కోరారట. వెంటనే ఆయన గ్రామదేవతను దర్శించుకుని స్వామివారి కోసం రత్నగిరిలో వెతుకులాట ప్రారంభించారట.

అలా రత్నగిరిపై బహద్దూర్ వెతకగా, వెతకగా ఓ అంకుడు చెట్టు కింద సత్యదేవుడు స్వయంభువై దర్శనమిచ్చారట. వెంటనే స్వామివారి విగ్రహాన్ని భక్తిప్రపత్తులతో బహదూర్ ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి సత్యదేవుడు భూలోక సంరక్షణార్థం నిత్యపూజలు అందుకుంటూ, ప్రజల పాపాలను హరిస్తూ.. అందరూ సుఖసంతోషాలతో జీవించేలా చేస్తూ వేనోళ్ల కొనియాడబడుతున్నారు.

అలా దిన దిన ప్రవర్తమానంగా వెలుగొందుతూ వచ్చిన అన్నవరం క్షేత్రంలో నేటికి భక్తులు ఇచ్చే విరాళాలతో ప్రతి ఏడాది సుమారు కొన్ని లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. ఇలా విరాళాల రూపంలో భక్తులు ఇచ్చే నిధులు 18 కోట్లకు పైబడే ఉంటుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణ దినాలలో అన్నదానం, సంవత్సరాంతాల్లో పులిహోర, దద్దోజనం ప్యాకెట్లను భక్తులకోసం పంపిణీ చేస్తుంటారు. ముఖ్యంగా అన్నవరం సత్యదేవుడి ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గోధుమరవ్వ, పంచదార, నెయ్యితో తయారుచేసిన ఈ ప్రసాదం అమృతంకంటే ఇంకా ఎక్కువ రుచితో ఉంటుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం స్వామివారి ప్రసాదం కోసం మాత్రమే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం వేయకమానదు.

సత్యనారాయణుడి వ్రతం ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని.. ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో ప్రతి నిత్యం వేలసంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు వ్రతాలు జరుగుతుంటాయి.

గోమాతను పూజిస్తే ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటామని భక్తులు నమ్మతుంటారు. అందుకే దేవస్థానం అధికారులు ఇక్కడ గోసంరక్షణ సమితిని ఏర్పాటుచేసి గోవులను సంరక్షిస్తున్నారు. అలాగే 7 రకాల జాతుల గోవులతో కూడిన "శ్రీగోకులం"ను కూడా ఏర్పాటు చేసి, ప్రతినిత్యం గోమాతలకు పూజలను నిర్వహిస్తున్నారు.

ఇక అన్నవరం ఆలయ విశిష్టత గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విశేషం సూర్య గడియారం. ఇది సూర్యుడి కాంతినిబట్టి సమయాన్ని తెలియజేస్తుంది. ఈ సూర్య గడియారం ఒక్క అన్నవరంలో మాత్రమే ఉందని పండితులు చెబుతుంటారు. అలాగే ఇక్కడ 1904లో ప్రతిష్టింపజేసిన ఫలబా యంత్రం ఇటు భక్తులను, అటు పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటోంది.

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామమైన అన్నవరం చేరుకోవాలంటే.. కలకత్తా-మద్రాసు జాతీయ రహదారిపై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ నుంచి 45 కి.మి. దూరం ప్రయాణించాలి. అదే రైలు మార్గంలో అయితే ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ మీదుగా విశాఖపట్టణం-విజయవాడకు వెళ్లే రైళ్లు నడుస్తుంటాయి.