శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Munibabu
Last Modified: మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (17:14 IST)

ఆంధ్రప్రదేశ్ ముద్ధుగుమ్మ : కొండపల్లి బొమ్మ

కొండపల్లి అనే పేరు చెప్పగానే ముచ్చటైన ముద్ధులొలికే చెక్కబొమ్మలు గుర్తుకు వస్తాయి. కళాకారులు చెక్కతో వివిధ రూపాల్లో అత్యంత అద్భుతంగా, అందంగా తయారు చేసిన ఈ బొమ్మలు దేశ విదేశాల్లో ఎందరినో ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పేరును ఖండాతరాలు దాటించిన విశేషాల్లో కొండపల్లి బొమ్మలకూ స్థానం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గల ఇబ్రహీంపట్నం మండలంలో వెలసిన ఓ చిన్న గ్రామమే కొండపల్లి. ఇక్కడుండే కళాకారులు పొనికి చెక్కతో తయారు చేసే వివిధ కళారూపాలు కొండపల్లి బొమ్మల పేరుతో దేశాంతర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. ఎలాంటి అచ్చుల్లోనూ పోసి ఈ కొండపల్లి బొమ్మలను తయారు చేయకపోవడం ఈ బొమ్మల ప్రత్యేకత.

కేవలం చేతితో కొన్ని రకాల పనిముట్లను ఉపయోగించి మాత్రమే కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఒక బొమ్మ లాంటిదే మరొకటి చేయాలంటే మళ్లీ చేతితో కొత్తగా తయారు చేయడమే తప్ప ఎలాంటి నమూనాలు, అచ్చులు ఉపయోగించకపోవడం వీటి ప్రత్యేకత. తేలికైన పొనికి అనే చెక్కతో తయారు చేయబడే ఈ కొండపల్లి బొమ్మల తయారీ వెనక కళాకారుల శ్రమ ఎంతో దాగిఉంది.

ముందుగా పొనికి చెక్కపై తయారు చేయాల్సిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. అనంతరం రంపపు పొట్టు, చింత గింజల పొడితో ఈ చెక్కబొమ్మకు రూపాన్ని సంతరిస్తారు. దీనికి సున్నం పూసి ఆరబెట్టి అటుపై వివిధ రంగులతో బొమ్మను ఆకర్షనీయంగా చేస్తారు. కొండపల్లి బొమ్మల్లో ఏనుగు అంబారి, మావటివాడు, నృత్యం చేసే అమ్మాయి బొమ్మలు, పల్లె పడుచులు లాంటి బొమ్మలు చూచేవారిని విపరీతంగా ఆకర్షిస్తాయి.


ఈ తరహా బొమ్మలు మాత్రమే కాక అన్ని రకాల జంతువుల, పక్షుల బొమ్మలు సైతం కొండపల్లి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. దేనికదే వైవిధ్యంగా, చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ కొండపల్లి బొమ్మలు విదేశీయుల గృహాల్లో సైతం కొలువుతీరడం గమనార్హం. కేవలం బొమ్మలు తయారు చేసే ఓ గ్రామంగానే కాక కొండపల్లిలో కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన ఓ కోట కూడా కలదు.

మూడంతస్తుల రాతి బురుజు కలిగిన ఈ కోట పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది. అలాగే ఈ ప్రాతంలో విరూపాక్ష దేవాలయం సైతం కలదు. ఆంధ్రప్రదేశ్ దర్శనీయ స్థలాలపై మక్కువ ఉన్నవారు ఓసారి కొండపల్లిని దర్శించి అక్కడి విశేషాలతో పాటు కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకునే వివిధ రకాల బొమ్మల తయారీని పరిశీలించగల్గితే ఓ చక్కని మధురానుభూతి సొంతమవుతుంది.

విజయవాడకు దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండపల్లి గ్రామానికి రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.