మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

కాఫీ తోటల సుమధుర పరిమళాల "అనంతగిరి"

PTI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లలో ఒకటి అరకు "అనంతగిరి". ఇది విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ, రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రశాంతమైన ప్రకృతి నడుమ దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, ముగ్ధ మనోహర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా, కమనీయంగా ఉండటంతో సంవత్సరంలో ఏ కాలంలో అయినా అక్కడికి వెళ్లవచ్చు.

మేఘాలను తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గ సామ్రాజ్యమంటే అతిశయోక్తి కాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్ పై భాగంలోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది.

తిరుమలగిరికి వెళ్లేందుకు ఘాట్ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ముక్కుపుటాలు అదిరిపోయేలా సుగంధ పరిమళాలను మోసుకొచ్చే కాఫీ తోటలు ఓవైపు, రకరకాల పండ్ల అలరించే పళ్లతోటలు మరోవైపు మనసును ఆనంద డోలికల్లో ముంచెత్తివేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పళ్ల తోటలు మాత్రమే కాకుండా వన మూలికలు కూడా లభ్య మవుతుంటాయి.

ముఖ్యంగా తిరుమలగిరిలోని భవనాశి సరస్సును పవిత్ర తీర్థంగా పర్యాటకులు సేవిస్తుంటారు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బద్రీనాథ్‌గా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

FILE
అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలా రావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి.

భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అనంతగిరి కొండలు అత్యంత రమణీయంగా ఉంటూ అహ్లాదకర వాతావరణంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా ఇక్కడ వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం కూడా పర్యాటకులను, భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతోంది. ఆంధ్రా ఊటీగా స్థానికులచే ప్రేమగా పిల్చుకోబడుతున్న ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిపడేస్తున్నట్లుగా ఉంటాయి.

ఇదిలా ఉంటే.. అటు పర్యాటకులను, ఇటు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అనంతగిరి కొండలు ఇటీవలి కాలంలో సమస్యాత్మకంగా కూడా మారాయి. ఈ కొండల్లోని ఘాట్ రోడ్డులో జరుగుతున్న దారి దోపిడీలు పర్యాటకులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అదే విధంగా ఈ కొండలు నిషేధిత ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉండే కొన్ని సంస్థలకు స్థావరాలుగా మారుతున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే... ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.