శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

చెదిరిపోని సజీవ సాక్ష్యం మిడ్తూరు "చెన్నకేశవ ఆలయం"

FILE
శతాబ్దాల చరిత్రను తనలో ఇముడ్చుకుని, ఆ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పురాతన దేవాలయం మిడ్తూరులోని "శ్రీ లక్ష్మీ చెన్న కేశవ ఆలయం". శిల్ప సంపదకు, ప్రకృతి రమణీయతకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం ఆంధ్రరాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద ఆలయంగా విరాజిల్లుతోంది. సూర్యభగవానుడంతటివాడు ప్రతియేటా స్వామివారి పాద పూజ చేసి తరిస్తుండటం విశేషంగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ఓసారి దర్శిద్దామా..?!

చెన్నకేశవ ఆలయాన్ని జనమేజయ మహారాజు నిర్మించినట్లుగా పూర్వీకులు చెబుతున్నా.. హరిహరరాయలు, బుక్కరాయల కాలంలోనే అభివృద్ధి చెందినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. సదాశివరాయలు జైత్రయాత్ర కొనసాగిస్తూ, మిడ్తూరులోని స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి, ప్రాకార నిర్మాణానికి పూనుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆ తరువాత సింగరాజు పుత్రుడు కోనయ్యదేవ మహారాజు స్వామివారి కైంకర్యాలకు, సేవలకు భూదానం చేసినట్లు కూడా తెలుస్తోంది.

ఆలయంలోని ధ్వజ స్తంభం, రంగుల మండపం, గర్భగుడి, ఆనాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి దర్పనం పడుతున్నట్లుగా ఉన్నాయి. ఆలయ ముఖద్వారం గుండా గుడి లోపలికి ప్రవేశించగానే చుక్కలు తాకేటట్లుగా ఉండే కొయ్యతో చేసిన ధ్వజస్థంభం, రంగుల మండపం శిల్పకళారాధకులకు కన్నుల పండువ చేస్తాయి.

ఆలయానికి ఉత్తర వాయువ్య దిశగా అర ఎకరం విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న పవిత్ర పుష్కరిణిలోని జలంతోనే అప్పట్లో స్వామివారిని అభిషేకించేవారట. అయితే ప్రస్తుతం సరైన ఆలనాపాలనా లేని కారణంగా పుష్కరిణి చుట్టూ ముళ్లపొదలు పెరిగి, శిథిలావస్థకు చేరుకోవటంతో కేవలం తిరునాళ్ల సందర్భంగా మాత్రమే పుష్కరిణి శుభ్రం చేస్తున్నారు.

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు జరిగే తిరునాళ్ల మహోత్సవంలో స్వామివారిని ఊరోగించేందుకు తయారు చేసిన 30 అడుగుల ఎత్తైన కొయ్య రథం ఆనాటి కళా వైభవానికి ఓ మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది 20 నుంచి 50 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రాకారం నేటికి చెక్కుచెదరకుండా చాలా పటిష్టంగా ఉంది.

ముఖ్యంగా చెన్నకేశవ ఆలయ ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే.. ప్రతి ఏడాది క్షైత్ర శుద్ధ పాడ్యమి అనగా తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన, సాయం సంధ్యవేళలో సూర్య భగవానుడి లేలేత తేజో కిరణాలు ఆలయ ముఖద్వారం, రంగుల మండపందాటి స్వామివారి పాదాలను స్పృశించటం నేటికి తటస్థితూనే ఉంది. దీంతో సూర్యభగవానుడంతటివాడు స్వామివారి పాదపూజ చేసి తరిస్తుండటం విశేషమని అందరూ చెప్పుకుంటుంటారు.

ఇదిలా ఉంటే.. తిరుపతి వేంకటకవులు మిడ్తూరు చెన్నకేశవ ఆలయం ప్రపంచంలోని 101 తిరుపతులలో ఒకటి అని సూచించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. నాటి మిరుతూరు నేటి మిడ్తూరు సముద్రమట్టానికి వేలాది మీటర్ల ఎత్తులో గ్రామం ఏర్పడటమేగాకుండా, మిర్రుగా ఉన్న ప్రదేశంలో గ్రామం ఉండటంతో అప్పట్లో మిరుతూరుగా వ్యవహరించేవారట. కాలక్రమేణా అది నేటి మిడ్తూరుగా పిలువబడుతోంది.

అంతేగాకుండా ఈ చెన్నకేశవ ఆలయంలో దేశంలో ఎక్కడా లేనంతగా మూగజీవాలైన కోతుల పోషణ కోసం ప్రత్యేకంగా వాటిపేరుమీద మాన్యం భూములుండటం ఇక్కడి మరో విశేషం. దాదాపు 30 ఎకరాలున్న ఈ భూములను నేటికీ కోతుల మాన్యంగానే పిలువబడుతోంది. అందుకే ఇది కోతుల మిడ్తూరుగా కూడా పేరుగాంచింది.

స్వామివారి కళ్యాణోత్సవం, పల్లకి సేవలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుగుతుంటాయి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మాణం పెరగనందున, ఆలయం కంటే ఎత్తులో మిద్దెలు, భవంతులు నిర్మిస్తే పతనం చెందుతారనే మూఢవిశ్వాసంతో నేటికి మిడ్తూరులో మేడలు నిర్మించేందుకు ప్రజలు జంకుతున్నారు. అదేవిధంగా మిడ్తూరులో మామిడిచెట్లు మొలచిన దాఖలాలు లేకపోవటం అనేది ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేయకమానదు.