బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

నాడు "వైభవం"... నేడు "నిర్లక్ష్యం".....!!

FILE
సాగర తీరంలో విరబూసిన ప్రకృతి అందాల పరిమళాలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన "రామాయపట్నం". గుడ్లూరు, ఉలవపాడు అభయ మండలాల మేలి కలయికతో ఏర్పడ్డ ఈ సముద్ర తీర ప్రాంతం ఆనాటి తెల్లదొరల కాలంలోనే పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. స్వదేశీయులేగాక, విదేశీయులు సైతం సేద తీర్చుకునేందుకు ఆనాడే ఇక్కడ విశ్రాంతి మందిరాలు సైతం వెలసి.. పర్యాటకులను సాదరంగా స్వాగతించింది.

రామాయపట్నం సముద్ర తీరంలో చేపల వేట ప్రధాన జీవనాధారంగా నివసిస్తున్న మత్స్యకారులు, విదేశీ నౌకలు సులభంగా తీరప్రాంతానికి చేరుకునేందుకు వీలుగా ఆ రోజుల్లోనే ఇక్కడ లైట్‌హౌస్‌ను కూడా నిర్మించారు. బ్రిటీష్ వారి కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌లోని లైటు మొదట్లో కిరోసిన్, బొగ్గు తదితర ఇంధనాల సహాయంతో వెలుగుతూ ఉండేది. అయితే 1980వ సంవత్సరం తరువాత లక్షల రూపాయలను వెచ్చించి, దీనిని రీమోడలింగ్ చేసి.. ఎలక్ట్రిసిటీ, ఎలాట్రానిటీ పద్ధతుల ద్వారా లైటును వెలిగిస్తున్నారు.

రామాయపట్నంలోని లైట్‌హౌస్‌లోని దీపాల వెలుగు వంద కిలోమీటర్లకు పైగా కనిపిస్తుంటుందని పర్యాటకులు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి అధునాతన లైట్‌హౌస్‌లు దేశంలోనే చాలా అరుదుగా ఉంటాయని కూడా చెబుతుంటారు. ఇలాంటి లైట్‌హౌస్‌లు అర్ముగం, క్రిష్ణపట్నం, నాగాయిలంక, మచిలీపట్నం, విశాఖపట్నంలలో మాత్రమే ఉన్నాయి. ఇంతటి ప్రత్యేకత గల లైట్‌హౌస్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున యాత్రికులు రామాయపట్నాన్ని సందర్శిస్తుంటారు.
మనోహర కట్టడాల సోయగం..!
ర్.ఆర్. విలియమ్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఒకరు 1874వ సంవత్సరంలో 111 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కట్టడాలు "నభూతో న భవిష్యత్" అన్నట్లుగా ప్రకృతి సౌందర్యంతో పాటు, భారీ స్థాయిలో వృక్ష రాజాలతో కూడి.. చూపరులకు పట్టలేని ఆనందాన్ని కలిగిస్తాయి....


రామాయపట్నం లైట్‌హౌస్ వెలుగు వల్ల విదేశీ నౌకలు సైతం తీరప్రాంతాలకు చేరుకున్న సందర్భాలు అనేకసార్లు జరిగినట్లు స్థానికుల కథనాలను బట్టి తెలుస్తోంది. లైట్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదం కలిగించే ఉద్యానవనాల పెంపకం కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంటుంది.

సమీప గ్రామాలైన కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండిపాలెం, సాలిపేట గ్రామాలు బకింగ్‌హామ్ కాలువ సముద్ర తీర ప్రాంతాల మధ్యన ఉండటంతో.. పచ్చదనం పరచినట్లుగా ఉండే అందమైన తోటలు చూపరులకు అదే ఊటీ, కొడైక్కెనాల్ అన్న భావాన్ని కలిగించక మానవు.

నిత్యం... నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని ప్రజలే కాకుండా.. సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు రామాయపట్నాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు. కార్తీక పౌర్ణమి, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సర వేడుకలతో పాటు రకరకాల పర్వదినాలలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులతో ఈ సాగర తీర ప్రాంతం పులకిస్తుంటుంది.

గతంలో పిక్నిక్ స్పాట్‌గా కూడా వన్నె తెచ్చిన రామాయపట్నం బీచ్ ప్రాంతంలో రాన్రానూ పర్యాటకుల తాకిడి తగ్గినప్పటికీ.. ఆక్వాసాగు పుణ్యమాని ఆ ప్రాంతం నిత్యం జనజీవనంతో కళకళలాడుతూ కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గంలో అనేక చారిత్రిక ఘట్టాలు చోటు చేసుకోవడంతో రామాయపట్నాన్ని పర్యాటక కేంద్రంగా పరిగణించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

FILE
రామాయపట్నం తెట్టు మార్గంలో పర్వతశ్రేణిపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం భక్తుల పాలిట కొంగు బంగామై విలసిల్లుతోంది. అతి ప్రాచీన దేవాలయం అయినందువల్ల.. పలువురు పర్యాటకులు, ఈ నరసింహ గిరిని సందర్శించకుండా వెళ్లేవారు కారు. అదే విధంగా బ్రిటీష్ పాలకులకు చిహ్నంగా నిలిచిన "థియోలాజికల్ బాప్టిస్ట్ సెమినార్ చర్చ్"ని కూడా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

ఆర్.ఆర్. విలియమ్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఒకరు 1874వ సంవత్సరంలో 111 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కట్టడాలు "నభూతో న భవిష్యత్" అన్నట్లుగా ప్రకృతి సౌందర్యంతో పాటు, భారీ స్థాయిలో వృక్ష రాజాలతో కూడి.. నయనాలకు పట్టరానికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ చర్చి కాంపౌండులో 5 మతాలకు చెందిన శిక్షణ కళాశాల కూడా గతంలో ఉండేదట. ఈ చర్చి సందర్శనాకోశంలో వేలాదిమంది విదేశీయులు వచ్చినట్లుగా చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి.

అలాగే తెట్టు గ్రామం కూడా చారిత్రికంగా ప్రసిద్ధి పొందినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. తెట్టు అనే పదం ద్రావిడ భాష నుంచి వెలువడింది. దీని అర్థం కంచె, అవరశీ అనే రాజు దర్బారుకు కట్టుకునే కోటగోడ అనే అర్థాలున్నట్లు చెబుతారు. కన్నడంలో తదలు, తద్లు అని.. తమిళంలో తెర్రు, తెత్తు అని.. తెలుగులో తెట్టుపు, తెట్టు అనే అర్థాలు ఉన్నప్పటికీ భావం మాత్రం.. రక్షణ కోసం నిర్మించుకునే గోడ అనే అర్థం వస్తుంది.

పూర్వకాలంలో రామాయపట్నం ఓ రాజ శోభితమైన కట్టడంగా ఉండేదనీ.. దానికి తెట్టు ప్రహరీగా ఉండేదని గ్రామస్థుల కథనాన్ని బట్టి అర్థమవుతుంది. 116 సంవత్సరాల చరిత్ర కలిగిన "సుల్తాన్ బీబీ అమ్మవారి దర్గా" కూడా తెట్టు గ్రామంలో ఉండటంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి కూడా విశేషంగా తరలివస్తుంటారు.

ఇన్ని చారిత్రక నేపథ్యాలు, ప్రత్యేకతలు కలిగిన ఉన్న రామాయపట్నం ప్రకృతి రమణీయత... దాదాపు రెండు దశాబ్దాల కాలం నుండి పాలకుల నిరాసక్తత, నిర్లక్ష్యం కారణంగా చాలా వరకు నష్టపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ ప్రాంతంపై దృష్టి సారించి.. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లేలా రామాయపట్నాన్ని తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు, పర్యాటకులు ఆకాంక్షిస్తున్నారు.