గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Ganesh

మున్నార్‌, అలెప్పీలో ఆనందాల "హనీమూన్ హోంస్టే"

FILE
సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో ముగ్ధ మనోహర దృశ్యాలతో శోభిల్లే అందమైన సముద్ర తీరాలు, సెలయేటి గలగలలు, టీ తోటల సుమధుర పరిమళాలు.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ మనసును అబ్బురపరిచేదే. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు ఇదో ప్రేమ సామ్రాజ్యమంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి హోంస్టేలు హనీమూన్ జంటలకు ఓ మన్మధ సామ్రాజ్యాన్ని సృష్టించి బహూకరిస్తుంటాయి. ఎటుచూసినా పచ్చదనంతో మనసును దోచుకునే ఇలాంటి ఆనందాలను తనివితీరా దర్శించాలంటే భూతల స్వర్గం కేరళను దర్శించాల్సిందే.

"కేర" అంటే సంస్కృత భాషలో కొబ్బరి చెట్టు అని అర్థం. అలాంటి కొబ్బరి చెట్లతో నిండిన ప్రదేశం కాబట్టే ఈ ప్రాంతాన్ని "కేరళ" అని పిలుస్తుంటారు. కేరళలో హనీమూన్ జంటల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న హోంస్టేలలో విహారానికి వచ్చిన సందర్శకులకు సాదర స్వాగతం లభిస్తుంది. హోంస్టే అంటే అచ్చంగా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగించే ప్రదేశమని చెప్పవచ్చు. లాడ్జీలు, హోటల్స్ కంటే ఈ హోంస్టేలు సొంత ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగిస్తూ గౌరవ ఆతిథ్యాన్ని అందిస్తాయి.

మరీ ముఖ్యంగా హనీమూన్ జంటలకు హోంస్టేలు చాలా సంతృప్తిని కలిగిస్తాయి. ఈ హోంస్టేలు నగర వాతావరణానికి దూరంగా నిర్మించటంవల్ల అక్కడ ఆతిథ్యంపొందే జంటలకు అచ్చంగా ఇంట్లోనే ఉన్నామా అనే అనుభూతిని కలిగిస్తాయి. సముద్రం ఒడ్డున, సెలయేళ్ల నడుమ, హిల్‌స్టేషన్ అయిన మున్నార్ ఎస్టేట్‌, ప్లాంటేషన్ బంగళాలు.. తదితర ప్రాంతాలలో ఈ హోంస్టేలను నిర్మించారు.

సాయం సందెవేళల్లో సూర్య కిరణాలు నారింజ రంగులో మురిపిస్తుంటే.. అక్కడి టీ తోటల్లో విహరిస్తూ, ప్రకృతిలో మమేకమై.. ఒకరికి ఒకరై ఆనందాలను అనుభవించటం ఏ జంటకైనా ఓ మరపురాని అనుభూతే కదూ..! ఈ అనుభూతులను నిజం చేస్తాయి కేరళలోని హోం స్టేలు. హనీమూన్ ప్యాకేజీలలో భాగంగా ఈ హోంస్టేలను సందర్శించవచ్చు.

హనీమూన్ ప్యాకేజీలలో భాగంగా మున్నార్, అలెప్పీలలో 4 రాత్రులు ఆనందంగా గడిపేందుకు కేవలం ఓ 14 లేదా 15 వేల రూపాయలను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ ప్యాకేజీలో మున్నార్ వద్దగల రేంజర్ ఉడ్స్ హోంస్టేలో రెండు రాత్రులపాటు భోజన సదుపాయాలతోపాటు ఆతిథ్యం పొందవచ్చు. అలాగే అక్కడ ఉన్న టీ తోటలమధ్య నూతన జంటలు రెక్కలు కట్టుకుని విహరించవచ్చు. మున్నార్ టౌన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో గల పోతమేడులో ఈ రేంజర్ ఉడ్స్‌లో వేడినీటి సౌకర్యంతోపాటు, శాటిలైట్ టీవీ, ఇన్‌హౌస్ లాండ్రీ లాంటి సదుపాయాలెన్నో లభిస్తాయి.

FILE
రేంజర్ ఉడ్స్ హోంస్టేలోని టెర్రస్‌పై కూర్చుని భానుడి లేలేత కిరణాల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, మనసుకు నచ్చిన నెచ్చెలి ఇచ్చే వేడి వేడి కాఫీని తాగుతూ ప్రకృతిలో లీనమైపోవచ్చు. ఇక్కడ జంటలు ఫిషింగ్, బోటింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ కూడా చేయవచ్చు. ఇక సాహసాలను బాగా ఇష్టపడే జంటలు ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ లాంటివాటితోపాటు ఆదివాసీ కాలనీలను కూడా ఎంచక్కా చుట్టేయవచ్చు.

అదలా ఉంటే.. హోంస్టేలలో తమ భాగస్వామికి స్వయంగా వండి, వడ్డించాలని భావించే జంటలకు వంట చేసుకునే సదుపాయం కూడా ఉంది. రేంజర్ ఉడ్స్ హోంస్టే తరువాత, అలెప్పీలోని వెంచానంద్ హైస్ హోంస్టే కూడా హనీమూన్ జంటలు దర్శించదగ్గ అందమైన ప్రదేశం. ఈ హోంస్టేకి మూడువైపులా వెంచానంద్ సరస్సు కనువిందు చేస్తుంటుంది. హౌస్ బోట్లలో విహారం, ఆయుర్వేద మసాజ్‌, ఫిషింగ్.. లాంటివి హనీమూన్ జంటల ఆనందాలను రెట్టింపుచేస్తాయి.

కాగా.. మున్నార్‌కు కారులో ప్రయాణం చేయాలనుకునేవారు కొచ్చి నుంచి దాదాపుగా 136 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణ సమయం 4 గంటలు ఉండవచ్చు. మున్నార్‌కు కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వారు ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులను కూడా నడుపుతోంది.

తమిళనాడులోని తేని, కుంబం, మధురై, కోయంబత్తూర్‌ల నుంచి కూడా ప్రతిరోజూ బస్సు సర్వీసులు తమిళనాడు-కేరళ ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాగా.. ఎర్నాకులం నుంచి 135, తేక్కడి నుంచి 110, తిరువనంతపురం నుంచి 330, పళని నుంచి 120, కోయంబత్తూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మున్నార్ చేరుకోవచ్చు.