శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. ఏపీ టూరిజం
Written By Munibabu
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2008 (18:18 IST)

విజయనగరాధీశుల చివరి మజిలీ... చంద్రగిరి

అలనాడు ఆంధ్రదేశాన్ని పాలించిన రాజ వంశీయుల్లో విజయనగర రాజులకున్న ఘన చరిత్ర ఏపాటిదో అందరికీ తెలిసిందే. కృష్ణ దేవరాయల పాలనలో ఉచ్ఛస్థితిలో ఉన్న విజయనగర సామాజ్రం అ తర్వాతి కాలంలో పతనం చెందడం ప్రారంభించింది. అలా వైభవం కోల్పోతూ వచ్చిన విజయనగర రాజుల చివరి మజిలీగా నిలిచిందే చంద్రగిరి కోట.

ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీప దూరంలో ఉన్న చంద్రగిరి వద్ద నిర్మితమైన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతోంది.

కోట చరిత్ర
దాదాపు 1640 ప్రాంతంలో విజయనగర రాజులు చంద్రగిరిలోని కొండకు దిగువబాగంలో ఈ కోటను నిర్మించారు అప్పట్లో ఈ కోటను చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. కొండకు దిగువభాగంలో నిర్మించిన ఈ కోట రక్షణ అవసరాలకోసం కోట చుట్టూ దాదాపు కిలో మీటరు మేర ఓ రాతి గోడను నిర్మించారు. పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ రక్షణ గోడ నేటికీ చాలాబాగం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం.

విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి కోటకు ఓ విశేషమైన స్థానం ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. శ్రీవారి భక్తుడైన కృష్ణదేవరాయులు తిరుమల విచ్చేసిన ప్రతిసారీ చంద్రగిరి కోటలోనే విశ్రమించేవారని ప్రతీతి. అయితే ప్రారంభంలో అప్పుడప్పుడూ మాత్రమే ఉపయోగించబడిన ఈ కోట రాయల వంశస్థుల్లో చివరి రాజులు చంద్రగిరి నుంచే పాలన సాగించారు.


చంద్రగిరి కోటలో రాయల వంశస్థుల పాలన జరుగుతున్న కాలంలోనే భారతదేశంలో బ్రిటీష్ వారి వలసలు ప్రారంభం కావడం గమనార్హం. అలాగే శ్రీకృష్ణదేవరాయల పాలనలో మంత్రిగా విశేష ఖ్యాతినార్జించిన మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం ఈ చంద్రగిరే కావడం విశేషం.

చంద్రగిరి కోట విశేషాలు
ఆనాటి రాయల వంశ చరిత్రకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన చంద్రగిరి కోటలోని చాలా భాగం నేటికీ చెక్కుచెదరకుండా నిలవడం విశేషం. ప్రధానకోటకు చుట్టూ ఉన్న వివిధ నిర్మాణాలు కాలగమనంలో పాక్షికంగా దెబ్బతిన్నా ప్రధాన కోటమాత్రం నేటికీ చెక్కుచెదరలేదు. ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న ఈ కోటకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. ఐదుకోట్ల ఖర్చుతో కొత్త సొగసులద్దింది.

నిత్యం పర్యాటకులతో అలరారే ఈ కోటలో చక్కని గార్డెన్‌ను ఏర్పరచి పర్యాటకులు సేదతీరేందుకు వీలు కల్పించారు. అలాగే ప్రధాన కోటలోని మూడు అంతస్థులను ఆ కాలంనాటి వస్తువులతో ఓ చక్కని మ్యూజియంగా ఏర్పాటు చేశారు. రాయల వంశస్థులు ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలు, వస్తువులు, ఆ కాలం నాటి దేవాలయాల విగ్రహాలు లాంటివి ఈ మ్యూజియంలో పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

అలాగే ఈ కోట ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైటింగ్ షో పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుంది. సాయంత్రం సమయంలో తెలుగు, ఇంగ్లీషు వ్యాఖ్యానంతో సాగే ఈ సౌండ్ అండ్ లైటింగ్ షో‌ను కోట వెలుపల ఆరుబయట కూర్చుని వీక్షించవచ్చు. కోట లోపలిభాగంలో ఏర్పాటు చేసిన విద్యుద్ధీపాలను క్రమబద్ధంగా వెలిగిస్తూ దానికి శబ్ధాన్ని జతచేసి ఆనాడు చంద్రగిరి కోటలో పాలన జరిగిన తీరుతెన్నులను వివరించే ఈ ప్రదర్శన చూచి తీరాల్సిందే.