శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 18 మే 2021 (15:38 IST)

బ్లాక్ ఫంగస్ ప్రాణాంతకమా... తెలుగు రాష్ట్రాలలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఒకవైపు కరోనాతో దేశమంతా అల్లాడిపోతుంటే... దానికి బ్లాక్ ఫంగస్ కూడా తోడై కోవిడ్ బాధితులను వెంటాడుతోంది. కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. సోమవారం (17.05.21) నాటికి రాష్ట్రంలో 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 
బ్లాక్ ఫంగస్ కోణంలో పరీక్షలు
కరోనా వచ్చి తగ్గిన వారిలో... వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కరోనా తగ్గినా కూడా బాధితుల్లో బ్లాక్ ఫంగస్ ఉంటుందనే కోణంలో వారిని పరీక్షించాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధి చికిత్స, మందులకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువేనని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

 
''రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వచ్చింది. ఈ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, ఈ వ్యాధి కోసం వాడే మందులను బాధితులకు సమకూర్చడంపై తక్షణం చర్యలు తీసుకుంటున్నాం'' అని నాని వెల్లడించారు.

 
కరోనా నుంచి కోలుకున్న తర్వాత...
విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలులో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కరోనా బాధితులు... దాని నుంచి కోలుకున్న తర్వాత బయటపడినవే. అధికారికంగా నమోదైన కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతోంది. విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ కూడా కరోనా నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు.

 
''మధురవాడకు చెందిన 35ఏళ్ల మహిళ కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి చేరారు. అయితే ఆవిడలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. అవేంటో అర్ధంకాక ఆమె... తాను కోవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లారు. లక్షణాల ఆధారంగా అక్కడి వైద్యులు ఈఎన్‌టీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే బ్లాక్‌ ఫంగస్‌కు తమ వద్ద మందులు, చికిత్స లేవని చెప్పేయడంతో బాధితురాలు ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడి వైద్యులు లక్షణాల ఆధారంగా అది బ్లాక్ ఫంగస్ అని నిర్థారించారు'' అని బీజేపీ వైద్య విభాగ కన్వీనర్ ఆర్.రవికుమార్ చెప్పారు.

 
''విశాఖలో ఓ మహిళ బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అధికారికంగా దానిని పరీక్షలు చేసి ధృవీకరించాల్సి ఉంది'' అని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.

 
మరో బ్లాక్ ఫంగస్ కేసు
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదుకాగా... తాజాగా (17.05.21) మరో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 9 కేసులకు ఇది అదనం. ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సూర్యనారాయణ కోవిడ్ నిర్థరణ కావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఆసుపత్రి వైద్యులే ఆయనకు బ్లాక్ ఫంగస్ ఉందని నిర్థరించారు. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి... మెడికల్ కిట్ అందించారు. ప్రస్తుతం బాధితుడు గ్రామంలోనే హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

 
''కోవిడ్ బాధితుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీనికి ఈఎన్టీ వైద్యులు చికిత్స చేయాలి. అయితే విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో మొత్తం 100 పడకలు ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా కోవిడ్ రోగులతోనే నిండిపోయాయి. బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలి. అలాంటి సదుపాయం కల్పించే పరిస్థితి రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలోనూ లేదు. కోవిడ్‌కు అనుబంధంగా బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు పెరుగుతున్న నేపధ్యంలో అదనపు సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలి'' అని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి. కామేశ్వర రావు బీబీసీతో అన్నారు.

 
అంటువ్యాధి కాదు
ఎవరికైనా కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, ఒకవైపు దవడ వాయడం, నాలుకపై నల్లటి మచ్చలు ఉంటే... అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాల్సి ఉంటుందని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు. ''బ్లాక్ పంగస్ అనేది వైరస్ కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కొంతమందికి మాత్రమే వచ్చే వ్యాధి. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. దీనికి మందులు, చికిత్స ఉన్నాయి. ముఖ్యంగా ఇది వెంటనే ప్రాణాలను హరించే వ్యాధి కూడా కాదు'' అని ఉత్తరాంధ్ర కోవిడ్ నోడల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ బీబీసీతో అన్నారు.

 
కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్‌ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

 
సాధారణ ప్రజలకూ రావచ్చు
బ్లాక్‌ ఫంగస్‌నే 'మ్యూకర్‌మైకోసిస్' అని కూడా అంటారని, ఇది కొత్త వ్యాధి కాదని నిపుణులు అంటున్నారు. కేవలం కోవిడ్ బాధితులకే కాక, సాధారణ ప్రజలకూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వాతావరణంలో ఉండే మ్యూకర్మోసైట్స్‌ ఫంగిల వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుంది. కోవిడ్ బారిన పడిన వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో వారిలో ఈ బ్లాక్ ఫంగస్ చేరే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు అంటున్నారు.

 
''అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు, సైనస్, హెచ్ఐవీ, గుండె జబ్బులు కలవారిలో దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. క్యాన్సర్ చికిత్స, కిడ్నీ, లివర్ మార్పిడి జరిగిన వారు.. మోకాళ్ల నొప్పులు, ఆస్మా ఉన్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు. అందుకే వారిలో కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా ముక్కు నుంచి కంటికి, అక్కడి నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతుంది. అలాగే దవడ, చర్మం, ఊపిరి తిత్తులకు కూడా సోకుతుంది'' అని డాక్టర్ సుధాకర్ వివరించారు

 
ఎలా ఎదుర్కొవాలి?
బ్లాక్ ఫంగస్ అనేది సోకిన వెంటనే ప్రాణాలు తీసేంత ప్రమాదకర వ్యాధి కాకపోయినా, అలక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని ఈఎన్‌టీ వైద్యులు చెప్తున్నారు. ''జలుబు, ముక్కు పట్టేయడం వంటి లక్షణాలను సాధారణ లక్షణాలుగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు, కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు'' అని విశాఖలోని ఈఎన్‌టీ వైద్యులు ప్రసాదరావు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్ కేసులు ఏపీతో పాటు తెలంగాణ, కర్నాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా రిపోర్ట్ అవుతున్నాయని డాక్టర్ ప్రసాదరావు చెప్పారు.

 
కేసుల సంఖ్య చెప్పలేం
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణాలో మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్యను ప్రకటించ లేదు. కానీ, బ్లాక్ ఫంగస్ వార్తలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కలకలం రేపుతున్నాయి. నిర్మల్ జిల్లాలో కేసు గురించి వార్తలు వచ్చాయి. తరువాత హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయక పోయినా, దాని వైద్యం గురించి ఒక ప్రకటన మాత్రం ఇచ్చింది.

 
''కరోనా సమయంలో స్టెరాయిడ్స్‌ అధిక మోతాదులో వాడకం, ఆక్సిజన్ అందించే పరికరాలు సరిగా శుభ్రపరచకపోవడం వల్ల వ్యాధి వ్యాపిస్తున్నదని తెలుస్తోంది. వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యల గురించి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు సూచనలు ఇచ్చాం'' అని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించారు.

 
వ్యాధి బారిన పడిన వారికి ఉచిత చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రులను సిద్ధం చేసినట్టు ఆయన ప్రకటించారు. ఇదే విషయమై కొందరు ప్రైవేటు ఆసుపత్రులను బీబీసీ సంప్రదించగా వారూ కేసుల సంఖ్య చెప్పడానికి నిరాకరించారు. ''ప్రభుత్వ ఆదేశాల కారణంగా కేసుల సంఖ్యను చెప్పలేం'' అని ఒక ప్రముఖ ఆసుపత్రి డైరెక్టర్ అన్నారు. అయితే, బ్లాక్ ఫంగస్ కేసులకు తాము చికిత్స అందిస్తున్నట్టు ఆయన ధృవీకరించారు.
(హైదరాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్‌తో కలిసి)