శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (18:36 IST)

#100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...

అమెరికన్ నటి బెల్లా థోర్న్... పోర్నోగ్రఫీ షేరింగ్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని ఈ వారం ఆరంభంలో ప్రకటించారు. అందుకు కారణం, ఆ వెబ్‌సైట్‌లో 'రివెంజ్ పోర్న్' లేకుండా చేయాలన్న తన ఆకాంక్షేనని చెప్పారు. ఆ ప్రకటన వెనుక ఉన్న కథ ఇది.
 
బెల్లా కళ్ల నుంచి కన్నీళ్లు కారుతున్నాయి.
 
ఆమె పెంపుడు శునకాల్లో ఒకటి ఆందోళనగా ఆమె కాళ్లను చుట్టేస్తోంది. ఆస్ట్రేలియన్ షెపర్డ్ జాతికి చెందిన ఆ కుక్క పేరు మా.
 
మేం సోషల్ మీడియాలో అవమానాలు, బెదిరింపులు, కుంగుబాటు గురించి మాట్లాడుకున్నాం. డీప్‌ఫేక్ అతిపెద్ద బాధితురాలుగా ఆమె ఎలా మారిందన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. వేలాది పోర్నోగ్రాఫిక్ వీడియోల్లో ఆమె కనిపిస్తోంది.
 
''ప్రపంచం గురించి ఇలా మాట్లాడుకోవటం నన్ను కుంగదీస్తోంది. ఈ ప్రపంచం మీద చాలా ద్వేషం కలుగుతోంది'' అంటారామె.
 
కానీ, ఆమె కన్నీళ్లకు ఇవేవీ కారణం కాదు.
 
కెనడాలోని ఓంటారియో రాష్ట్రంలో సడ్బరీ ఒక ప్రశాంతమైన పట్టణం. శరత్కాలం ఆరంభమవుతోంది. ఊరంతా మాపుల్ ఆకులు చెల్లాచెదురుగా రాలుతున్నాయి. ఓ కొలను గట్టున బెల్లా అద్దె డెక్ మీద మేం కూర్చుని ఉన్నాం.
 
బెల్లా 'గర్ల్' షూటింగ్ కోసం మూడు నెలలుగా ఇక్కడే ఉన్నారు. ఆమెతో పాటు మిక్కీ రోర్క్ కూడా ఉన్నారు. ఆ చిత్రంలో తనను హింసిస్తున్న తండ్రిని చంపటానికి నిద్రాణమైన సొంత పట్టణానికి తిరిగి వచ్చిన యువతి పాత్ర పోషిస్తోంది బెల్లా.
 
ఈ 22 ఏళ్ల బెల్లా తన రహస్యాలను, మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పి ఏడాది అవుతోంది.
 
ఆమె తన తొలి పుస్తకం 'ది లైఫ్ ఆఫ్ ఎ వాన్నబీ మొగల్: మెంటల్ డిసర్రీ'ని విడుదల చేశారు. నిస్పృహ, ఒంటరితనం, లైంగిక దాడుల చుట్టూ అల్లుకున్న చీకటి స్వగత కవితా సంకలనం అది.
 
తొమ్మిదేళ్ల వయసులో తన తండ్రి ఒక మోటార్‌బైక్ ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచీ తీరని శోకాన్ని తడుముతారు. కళ్లు చెదిరే నియాన్ లైట్ల వెలుగులో చిన్నారి మోడల్‌గా తన కెరీర్ గురించి ప్రస్తావిస్తారు.
 
అక్కడి నుంచి డిస్నీ చానల్ సిట్కామ్‌లోకి (షేక్ ఇట్ అప్) ప్రయాణం గురించి ఉటంకిస్తారు. తనకు ప్రేమ అవసరం గురించిన ఆలోచనలు పంచుకుంటారు. తన గురించి విస్తృతంగా రాసిన విశాల లైంగిక జీవనశైలి గురించీ మాట్లాడతారు.
 
''నా జీవితమంతా నా మీద లైంగిక దాడులు జరిగినందుకా? అంత చిన్న వయసులో సెక్స్‌ గురించి.. ప్రపంచం అందించే అతి సహజమైన విషయం అది అని తెలిసినందుకా? అని ప్రశ్నించుకుంటారు.
 
ఆ కవితా సంకలనంలో కొన్ని పదాలను తెలిసే తప్పుగా వదిలేశారామె. ఆ పుస్తకం అమెజాన్ బెస్ట్ సెల్లర్స్ జాబితాలో కొన్ని వారాల పాటు కొనసాగింది.
 
మహిళ సారథ్యంలోని భవిష్యత్తుకు బాటలు వేస్తున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన మహిళలతో రూపొందించిన ‘బీబీసీ 100 మంది మహిళల’లో బెల్లా థోర్న్ కూడా ఉన్నారు.
 
ఆ పుస్తకం కోసం మీడియాతో మాట్లాడుతూ పర్యటిస్తున్న క్రమంలో... భావోద్వేగాలు నీరసింపచేస్తున్న తరుణంలో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు తనకు తెలియని ఓ నంబర్ నుంచి వరుస మెసేజ్‌లు అందాయి.
 
''నేను ఒక ఇంటర్వ్యూ నుంచి బయటకు వస్తున్నాను. ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ అప్పటికే ఏడుస్తున్నాను. అప్పుడు నా ఫోన్‌ను చూస్తే, అందులో నా నగ్న చిత్రాలు ఉన్నాయి'' అని గుర్తుచేసుకున్నారు బెల్లా.
 
ఒకప్పుడు తన మాజీ ప్రియుడికి పంపిన ఆ సాన్నిహిత్యపు ఫొటోలను చూసిన బెల్లా స్థాణువయ్యారు. ఏం చేయాలో పాలుపోక తన మేనేజర్‌కు, ఏజెంట్‌కు ఫోన్ చేశారు.
 
అప్పుడు ఆమె ఫోన్ మళ్లీ మోగింది.
 
మరిన్ని అర్థనగ్ర చిత్రాలు. ఈసారి ఆమె ప్రముఖ స్నేహితురాళ్లవి.
 
అప్పుడే తెల్లవారుతోంది. ఆమె ఇంకా మంచం మీద పడుకునే ఉన్నారు.
 
చిన్నప్పుడు తన మీద జరిగిన లైంగిక దాడి గురించి బెల్లా తన పుస్తకంలో వివరించారు. కానీ.. తనపై దాడిచేసిన వ్యక్తి వివరాలను చెప్పలేదు. తనను నమ్మరన్న తన భయం ఆ నేరం గురించి ఫిర్యాదు చేయకుండా ఎలా నిలువరించిందో అందులో తెలిపారు. ఇప్పుడు తన ఫోన్‌కు వచ్చిన అర్థనగ్న చిత్రాలను చూసినపుడు.. తాను మరచిపోని అత్యాచార వేదన ఆమెను మరోసారి నిలువెల్లా ఆవరించింది.
 
''మళ్లీ అదే జరుగుతోంది.. ఇంకెవరో నా జీవితాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. నా విషయంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మళ్లీ అదే జరుగుతోంది. లైంగిక విషయాలకు సంబంధించి నాకు ఇష్టంలేని పనులు చేసేలా నన్ను మళ్లీ బలవంతం చేస్తున్నారు'' అనిపించిందామెకు.
 
అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ట్విటర్‌లో 70 లక్షల మంది ఫాలోయర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 కోట్ల మంది ఫాలోయర్లు, ఫేస్‌బుక్‌లో 90 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆ వేదికల మీద బెల్లా స్వయంగా తన అర్థనగ్న ఫొటోలను విడుదల చేశారు. వాటితో పాటు తన ఫొటోలను హ్యాక్ చేసిన దుండగుడి బెదిరింపు సందేశం స్క్రీన్‌షాట్‌ను, తన సొంత సందేశాన్ని షేర్ చేశారు.
 
''వీటిని నేను విడుదల చేస్తున్నాను. ఎందుకంటే.. నా నుంచి మీరు మరొకటి లాగేసుకునే అవకాశం ఇవ్వరాదని ఈ నిర్ణయం తీసుకున్నాను.''
 
ఈ నిర్ణయం మీద అభిప్రాయాలు రెండుగా చీలిపోయాయి.
 
అమెరికన్ చాట్ షో ద వ్యూలో కనిపించే వూపీ గోల్డ్‌బర్గ్.. బెల్లాను తప్పుపట్టారు. ఆమె ఆ ఫొటోలను విడుదల చేసినందుకు కాదు.. అసలు ముందు ఆ ఫొటోలు దిగటాన్ని ఆక్షేపించారు.
 
''ఎవరైనా ప్రముఖ వ్యక్తి అయితే, వారి వయసు ఎంతన్నది నాకు అనవసరం. మిమ్మల్ని మీరు నగ్నంగా ఫొటోలు తీసుకోకూడదు. ఒకసారి అలా ఫొటో తీసుకుంటే అది క్లౌడ్‌లోకి చేరుతుంది. అది కావాలనుకున్న ఏ హ్యాకర్‌కైనా అందుబాటులో ఉంటుంది. 2019లో ఇదొక సమస్య అని మీకు తెలియదంటే... ఐ యామ్ సారీ'' అని ఒక చర్చా కార్యక్రమంలో గోల్డ్‌బర్గ్ వ్యాఖ్యానించారు.
 
గోల్డ్‌బర్గ్ వ్యాఖ్యలమీద బెల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ''రోతగా.. అసహ్యంగా ఉన్నాయి. నేను గొప్పగా భావించే ఒక మహిళ ఇలా వ్యాఖ్యానించటం మరింతగా బాధించింది'' అని కన్నీళ్లతో చెప్పారు.
 
''చాలామంది 'నో.. నో.. నా పిల్లలు ఎన్నడూ అలా చేయరు...' అంటుంటారు.''
 
ఈ జనానికి బెల్లా సందేశం ఇది: ''మీ ఇంట్లోకి నిజంగా తొంగిచూడాలని మీరు ఎన్నడూ కోరుకోరు. ప్రతి ఒక్క వ్యక్తీ ఆన్‌లైన్‌లో ఏదో ఒక విధమైన అనురాగాన్ని పంచుకుంటారు.''
 
ఈ విధంగా ప్రవర్తించటం పట్ల అప్పటికే అవమానానికి, దాడికి గురయ్యామని బాధపడుతున్న పిల్లలను బహిరంగంగా అవమానించటం, వారిని మరింతగా మానసిక ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టివేయగలదని ఆమె చెప్తారు.
 
''ఒక బాలిక లేదా బాలుడి ఫొటోను విడుదల చేసినపుడు, అది వారి స్కూల్‌లో చక్కర్లు కొడుతున్నపుడు, వారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నపుడు... ఇటువంటి ఒక ఇంటర్వ్యూను చూసి.. 'అవును.. నిజమే.. నాకు ఈ శాస్తి జరగాల్సిందే' అని భావిస్తారు'' అంటారు బెల్లా.
 
బెల్లా థోర్న్ స్వయంగా విడుదల చేసిన ఈ అర్థనగ్న చిత్రాలు.. ఆన్‌లైన్‌లో కనిపించిన ఆమె అసలైన అర్థనగ్న చిత్రాల్లో మొదటివి.
 
అయితే.. బెల్లా థోర్న్‌కు సంబంధించి లైంగికంగా అశ్లీల వీడియోలు చాలా చాలా ఉన్నాయి. కానీ అవేవీ నిజంగా ఆమెవి కావు. అవన్నీ డీప్‌ఫేక్ వీడియోలు. సెక్స్‌లో పాల్గొంటున్న ఒక నటి శరీరం మీద బెల్లా ముఖాన్ని అత్యంత నైపుణ్యంతో సూపరింపోజ్ చేసి తయారు చేసిన వీడియోలు అవి. తాము కోరుకున్నట్లు బెల్లా థోర్న్ మాట్లాడుతున్నట్లుగా వక్రీకరించిన వీడియోలు అవి.
 
అటువంటి వాటిలో ఒక వీడియోలో... బెల్లా చనిపోయిన తన తండ్రిని తలచుకుని విలపిస్తుండగా రికార్డ్ చేసిన ఆడియోను ఉపయోగించుకున్నారు. ఆ వీడియోలో హస్తప్రయోగం చేస్తున్న ఒక మహిళ ముఖం మీద బెల్లా ముఖాన్ని చేర్చారు.
 
''ఈ వీడియో షేర్ అవుతూ ఉంది. అందులో ఉన్నది నేను అని అందరూ అనుకుంటున్నారు. ఆపైన అందులో 'డాడీ.. డాడీ..' అని సబ్‌టైటిల్స్ కూడా పెట్టారు'' అని బెల్లా బీబీసీతో అన్నారు.
 
కేవలం ఒకే ఒక్క ఫొటోను ఉపయోగించుకుని డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేసే టెక్నాలజీ మరో ఏడాదిలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సాఫ్ట్‌వేర్ డెవలపర్లు బీబీసీకి తెలిపారు. ఇది బెల్లాను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
 
''ఆ టెక్నాలజీని కేవలం వారికి ఇష్టమైన సెలబ్రిటీ మీద ఉపయోగించటానికి మాత్రమే పరిమితం కాదు. చిన్నారుల నకిలీ పోర్నోగ్రఫీని అది ప్రేరేపిస్తుంది'' అంటారామె.
 
చిన్న పిల్లల మీద ప్రతీకారానికి, బ్లాక్‌మెయిల్ చేయటానికి, బెదిరించి డబ్బులు గుంజటానికి.. ఇటువంటి వీడియోలను ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. అటువంటి వారు అందరికీ.. ఈ నకిలీ వీడియోలు, బెదిరింపులను బట్టబయలు చేయటానికి తనలాగా డిజిటల్ వేదికలు ఉండవని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంలోనే బెల్లా డైరెక్టర్‌గా రంగంలోకి దిగటం గురించి - ఆమె దర్శకత్వంలో రూపొందిన 'హిమ్ అండ్ హర్' పెద్దల చిత్రం అవార్డు అందుకుంది - మేం మాట్లాడుకోవటం ప్రారంభించాం. అప్పుడే ఓ అనూహ్య సంఘటన జరిగింది.
 
ఈ సినిమా రూపొందించాలని తాను నిర్ణయించుకోవటానికి కారణం... స్త్రీ లైంగికత గురించి చెబుతున్న కథనాలను మార్చటానికి ఈ పరిశ్రమలో మహిళా దర్శకులు మరింత మంది ఉండాల్సిన అవసరముందని తాను భావించటమేనని ఆమె తెలిపారు.
 
బెల్లా తన చిత్రాన్ని విడుదల చేసిన వెబ్‌సైట్ పోర్న్‌హబ్‌... రివెంజ్ పోర్న్ వీడియోలతో లాభాలు గడిస్తోందని బయటపెట్టిన ఇటీవలి బీబీసీ పరిశోధన మీద వ్యాఖ్యానించాలని అప్పుడు నేను ఆమెను అడిగాను.
 
బీబీసీ పరిశోధన కథనం గురించి బెల్లా వినడం ఇదే మొదటిసారి అన్నది స్పష్టంగా కనిపించింది. ఆమె నిలువెల్లా వణికిపోయారు.
 
''ఈ విషయం నాకు తెలియదు'' అన్నారామె. ఆమె కళ్ల వెంట కన్నీరు ధారకట్టాయి. ''మనం పరిస్థితుల్ని మెరుగుపరుస్తున్నామని అనుకుంటూ... అవే పరిస్థితులకు జత కలుస్తుంటాం. నేను సాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ క్రమంలో ఎక్కడో...''
 
ఆమె గొంతు మూగబోయింది. పోర్న్‌హబ్ గురించి పరిశోధించటానికి సమయం దొరికిన తర్వాత.. ఆ వెబ్‌సైట్ గురించి ఆమె ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా? అని నేను ఆమెను అడిగాను.
 
''నేను నకిలీగా ఉండాలని కోరుకోవటం లేదు. కాబట్టి నా మొదటి జవాబుకే కట్టుబడి ఉంటాను'' అని చెప్పారు.
 
ఈ ఇంటర్వ్యూ ముగిసింది.
 
''యూజర్లు కంటెంట్‌ను షేర్ చేయటానికి, వినియోగించటానికి సురక్షిత ప్రదేశం అందించాలని మేం కోరుకుంటున్నాం. దీనిని రివెంజ్ పోర్న్‌కు చోటు కల్పించటం ద్వారా దెబ్బతీయాలని మేం ఎన్నడూ కోరుకోం'' అని పోర్న్‌హబ్ వెబ్‌సైట్ యాజమాన్య సంస్థ మైండ్‌గీక్ బీబీసీతో పేర్కొంది.
 
హోటల్ గదికి వెళ్లిన తర్వాత.. బెల్లా థోర్న్ అసిస్టెంట్ నుంచి నాకు ఫోన్‌లో ఒక మెసేజ్ వచ్చింది. కుంగుబాటు మీద కళంక దృష్టిని తొలగించటం కోసం నిర్వహిస్తున్న 'మేక్ స్యూర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఓకే' అనే కార్యక్రమంలో బెల్లా పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానిస్తూ పంపిన సందేశం అది.
 
అది బెల్లాకు చాలా ముఖ్యమైన అంశం. తన అభిమానులు.. ప్రత్యేకించి ఇటువంటి పరిస్థితులకు సులభంగా బాధితులుగా మారేవారు ఇది తెలుసుకోవాలన్నది ఆమె ఆకాంక్ష.
 
మూడు రోజుల తర్వాత.. బెవర్లీ హిల్స్‌లోని ఒక గార్డెన్ పార్టీలో జరిగిన ఆ కార్యక్రమంలో నేను ఉన్నాను.
 
''నేను పెరుగుతూ ఉన్నపుడు.. నాకు తెలిసిన డిప్రెషన్ బాధితులు చాలా కొద్ది మందే ఉండేవారు. కానీ, ఇప్పుడు దాదాపు మనకు తెలిసిన ప్రతి ఒక్కరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. దీని వెనుక ఏదో కారణం ఉండి ఉండాలి. నేను అనుకుంటున్న కారణం... వాళ్ళు సోషల్ మీడియాలో పెరగటం'' అని చెప్పారు బెల్లా.
 
నేను పార్టీ నుంచి బయలుదేరుతుండగా బెల్లా స్నేహితులు ఒకరు, మా ఇంటర్వ్యూ తర్వాత బెల్లా పోర్న్‌హబ్‌తో ఫోన్‌లో ముక్కుసూటిగా మాట్లాడి విషయం తేల్చేశారని చెప్పారు. పోర్న్‌హబ్ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా అన్నారు.
 
ఆ వారంలోనే బెల్లా తన దర్శకత్వంలో రూపొందించిన తొలి చిత్రం 'హర్ అండ్ హిమ్'కు పోర్న్‌హబ్ అవార్డు అందుకున్నారు.
 
పోర్నోగ్రఫీలో మహిళా దర్శకులు మరింత మంది ఉండాలన్న తన సృజనాత్మక దృష్టిని స్వీకరించిన అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే, రివెంజ్ పోర్న్ వీడియోలను ఖండిస్తూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
 
''ఒక మార్పు తీసుకురావటం కోసం ప్రతి ఒక్కరికీ... మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ భద్రత ఉండేలా చూడటం కోసం... హెచ్చరికల ఆల్గోరిథం వ్యవస్థలో మార్పును అమలు చేయటం కోసం నేను పోర్న్‌హబ్‌తో పనిచేస్తున్నాను'' అని ప్రకటించారు.