గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (16:17 IST)

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది?

ఓటర్ల గుర్తింపును నిర్ధారించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కొమ్మేపల్లి మున్సిపాలిటీలోని పది పోలింగ్ కేంద్రాలలో ఈ ప్రక్రియ చేపట్టారు.
 
సాధారణంగా పోలింగ్ కేంద్రంలోని అధికారి తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఓటరు గుర్తింపును ధ్రువీకరిస్తారు. అయితే ప్రతిసారి దొంగ ఓటర్లను నివారించడం సాధ్యం కానందున ఈసారి టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే పెన్షనర్ల కోసం ఒక ప్రత్యేక ఆప్ అందుబాటులో ఉంది. అందులో వాడిన టెక్నాలజీనే ఎన్నికలకు ఉపయోగిస్తునట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగి రెడ్డి తెలిపారు.
 
దీనికోసం ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రంలో మొదట పోలింగ్ అధికారి ఒక మొబైల్లో ఓటర్ ఫోటో తీసి దాన్ని ఓటర్ల జాబితాతో పోల్చి ధ్రువీకరిస్తారు అని అధికారులు తెలిపారు. "అధికారులకు కేటాయించిన మొబైల్ ఫోన్‌తో పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటర్‌ను ఫొటో తీస్తారు. అయితే, అప్పటికే ఆ మొబైల్ ఫోన్‌కు ఎన్నికల కమిషన్ డేటా అనుసంధానమై ఉంటుంది.
 
ఈ డేటా బేస్‌తో తాజా ఫోటోను ఈ సాంకేతికత పరిశీలించుకుంటుంది. ఆ రెండు ముఖాలు ఒకటేనా కాదా అనేది తేల్చుకుంటుంది. ఆ ఓటర్ సరైన వ్యక్తే అని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసేందుకు అనుమతి లభిస్తుంది'' అని తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఎండి జి టి వెంకటేశ్వర్ రావు తెలిపారు. 'ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నిం‌గ్‌ అండ్‌ డీప్‌ లెర్నింగ్‌'లను ఉపయోగించి ఈ మొబైల్‌ యాప్‌ను రూపొందించారు.
 
అయితే ఈ ఫేషియల్ రికగ్నిషన్ ఆప్ వాడకం పై పలు సందేహాలు వెలుగులోకి వచ్చాయి. డేటా యాక్టివిస్ట్ శ్రీనివాస్ కోడలి, ఈ ప్రక్రియ పై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. "ఈ ప్రక్రియ రిప్రజంటేషన్ అఫ్ పీపుల్స్ యాక్ట్, అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వంటి చట్టాలను సవరించకుండా చేపడుతున్నారు. 
 
2018లో చేపట్టిన ఇలాంటి ప్రక్రియ కారణంగా.. ఆధార్‌ను ఓటర్ ఐడీతో లింక్ చేయకపోవడంతో చాలా మంది ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గల్లంతయ్యాయి. ఈ ప్రక్రియ వ్యక్తిగత గోప్యత వంటి మౌలిక అధికారాల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇదో ఎన్నికల ఫ్రాడ్ కూడా" అన్నారు. ఇటువంటి ప్రక్రియను అమలు చేయాలి అనుకుంటే దీనికి ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు శ్రీనివాస్.
 
అయితే అధికారులు మాత్రం, పోలింగ్ రోజు సేకరించిన డేటాను ఎక్కడా భద్రపర్చకుండాన్నే డిలీట్ చేస్తామని తెలిపారు. "సర్వర్‌లో కానీ మొబైల్‌లో కానీ ఈ డేటాని సేవ్ చేయము. ఈ దిశగ తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఒక అండర్టేకింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుది" అని కమిషనర్ నాగిరెడ్డి వివరించారు.
 
బుధవారం నాడు జరిగిన ప్రక్రియ దాదాపుగా సాఫీగా జరిగిందని తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావు తెలిపారు. "ఒకటి రెండు చోట్ల కనెక్టివిటీ వల్ల కాస్త ఇబ్బంది ఎదురైంది. కానీ మిగిలిన చోట్ల ఈ ప్రక్రియ సఫలీకృతం అని చెప్పుకోవాలి. ఇటువంటి ఫీల్డ్ టెస్టింగ్ ఇప్పటి వరకు జరగలేదు. కనుక ఇవాళ జరిగిన ప్రక్రియ ఎంతో ఉపయోగకరం. కొన్ని కేంద్రాలలో కొంత మంది ఓటర్లను గుర్తించడం సాధ్యపడలేదు. 
 
ఓటర్ ఐడిలో ఉన్న ఫోటో పాతది కావటం, లేదా ఫొటో స్పష్టంగా లేకపోవడం మూలంగా ఇలా జరిగిందని గుర్తించాము'' అని తెలిపారు. అయితే ఈ టెక్నాలజీని ఇప్పుడు కేవలం పరీక్షించడానికే ఉపయోగించారు. పూర్తిస్థాయిలో దీన్ని అమల్లోకి తెచ్చినప్పుడు ప్రభుత్వం దానికి కావల్సిన అన్ని మార్గదర్శకాలను తీసుకొస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.