నూతన దంపతుల తొలి అడుగులకు మడుగులొత్తే సుందరమైన కొండల ప్రాంతమే కొడగు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉండే కొండలు, అడవులతో నెలకొని ఉంటుంది. దీనినే బ్రిటీష్‌వారు కూర్గు అనే పేరుతో పిలిచేవారు. కనుచూపు మేరలో ఎటుచూసినా కాఫీ తోటలు, మిరియాలు, యాలకుల తోటలతో సుమనోహరంగా ఉంటుందీ ప్రాంతం. ఎక్కడికెళ్లినా పచ్చదనం, నీలి ఆకాశం దానికింద పెద్ద పెద్ద లోయలు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడా జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొడగు ప్రాంతంలోనే కావేరీ నది జన్మించింది. కావేరీ నదీ ప్రవాహం ఆధారంగా చేసుకుని ఆ ప్రాంతంలో ఎన్నెన్నో విహార యాత్రా స్థలాలు రూపుదిద్దుకున్నాయి.