నీలి మేఘాలతో దోబూచులాడే "సింగపూర్"ను చుట్టేద్దామా..?!

Wild Life
Ganesh|
FILE
పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. అందుకే ఆ దేశ ఆర్థిక వనరుల్లో సైతం పర్యాటక రంగమే అగ్రగామి. తరచుగా వర్షం కురుస్తుండే ఈ దేశంలో వర్షం తరువాత పరచుకునే నీలిమేఘాలు అనిర్వచనీయమైన అద్భుత అందాలను మన కళ్లముందు ఆవిష్కరిస్తాయి. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు అలా వెళ్లివద్దామా..?!

యూరప్ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్న సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు బాషలు. అవి ఒకటి "మకాన్", రెండు "సింగ్లీష్". ఇంగ్లీష్ అనే బాషను విన్నామేగానీ, సింగ్లీష్ ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా..? మరేం లేదండి.. మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్ లాంటి ఇతర భాషలను ఇంగ్లీషుకు మేళవించి సింగపూర్ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్ అంటారు. ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే సింగపూర్ ఇంగ్లీష్ అనవచ్చు.

ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడాల్సిన ప్రదేశాలు బోలెడు. వాటిల్లో నైట్ సఫారీ, సింగపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, జూరాగ్‌ బర్డ్‌ పార్కు, మెర్ లయెన్ పార్కు, సెంతోసా ద్వీపం, అండర్ సీ వరల్డ్.. తదితరాలు చాలా ముఖ్యమైనవి.

సాధారణంగా జంతుప్రదర్శన శాలలను చూడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటారు. కానీ సింగపూర్‌లో మాత్రం రాత్రివేళల్లో కూడా వాటిని సందర్శించవచ్చు. దీనినే "నైట్ సఫారీ" అని పిలుస్తుంటారు. రాత్రివేళల్లో తిరిగే జంతువులను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమైన చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవకాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కల్పించింది సింగపూరే. రాత్రుల్లో జంతువులను వాటి సహజ పరిస్థితుల్లో చూసే అవకాశం కలగటంతో పర్యాటకులు ఓ వింత అనుభూతికి లోనవుతారు.
Wild Life
FILE


ఈ నైట్ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసుల స్వాగత నృత్యం. బలంగా ఉండే యువకుల విలువిద్యా కౌశల ప్రదర్శన, వెదురుబొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడముచ్చటగా ఉంటాయి. ఇందులో మరో ఆకర్షణ మంటలతో చేసే నృత్యం. నైట్ సఫారీను చూసేందుకు ట్రాములో వెళ్లాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాలలో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి.

140 సంవత్సరాల చరిత్ర కలిగిన "బొటానికల్ గార్డెన్స్" సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే, ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఆసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ కంప్యూటర్ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్ కూడా ఉంది. ఇక్కడ ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్కుగా ప్రఖ్యాతి చెందిన "జురాగ్ పక్షుల కేంద్రం" సింగపూర్‌లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం. 600 జాతులకు చెందిన 8 వేల పక్షులు నెలవైన ఈ పార్కును ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం ఉంది. మెయిన్‌ స్టేషన్‌లో ఎక్కి లోరీ స్టేషన్‌లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్‌ఫాల్‌ స్టేషన్‌లో దిగి మళ్లీ అక్కడనుంచి మెయిన్‌స్టేషన్‌ చేరుకోవచ్చు.


దీనిపై మరింత చదవండి :