పర్యాటక రంగ అభివృద్ధిలో దక్షిణాఫ్రికా

WILD LIFE
FileFILE
దక్షిణాఫ్రికా అనగానే ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచే మనకు గుర్తొస్తుంది. అయితే దక్షిణాఫ్రికా ఆటలకు మాత్రమే కాదు అన్ని విషయాలలో కూడా ముందుంది. ముఖ్యంగా పర్యాటక రంగంలో కోటిమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మరో రెండేళ్ళలో అక్కడ జరుగనున్న సాకర్ కప్పుతో ఈ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గత ఏడాది తొంబై లక్షల మంది విదేశీ పర్యాటకులు దక్షిణాఫ్రికాను సందర్శించారని ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2006లో 80 లక్షల 40 వేల మంది పర్యాటకులు దక్షిణాఫ్రికాకు వచ్చారని వెల్లడించింది.

ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతాలను వాటిలో నివసించే ప్రాణకోటిని వీక్షించేందుకు అమెరికా, యూరప్, ఆసియా దేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు ప్రతి ఏడాది వస్తున్నారని ఆ శాఖ పేర్కొంది. మనసుకు ఉత్సాహాన్నిచ్చే సముద్ర తీరాలు, అటవీ అందాలు దక్షిణాఫ్రికాను పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు దోహదం చేస్తున్నాయి.

ఇక్కడ ఉండే ఏనుగులు, ఏనుగు స్వారీ చూపరులను ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా ఈ దేశంలో సుమారు 300 క్షీరద జాతులు, 500లకు పైగా పక్షుల జాతులు, లెక్కలేనన్ని కీటకాలు ఉన్నాయి. అలాగే అన్ని కాలాల్లో, అన్ని వేళ్లలో జంతువులు సంచరించవు. వాటి జీవన విధానానికి అనుగుణంగా విభిన్న కాలాల్లో, వేళలలో అవి సంచరిస్తుంటాయి.

డాలర్‌తో పోలిస్తే దక్షిణాఫ్రికా ద్రవ్యం ర్యాండ్ విలువ బలహీనంగా ఉండడంతో, విదేశీ పర్యాటకులలో చాలామందికి దక్షిణాఫ్రికా చౌక పర్యాటక ప్రాంతంగా మారింది. నేరాల రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ చౌక ధరలకే ప్రయాణం అనే అంశమే ఆ దేశాన్ని పర్యాటకుల విడిది స్థలంగా మారుస్తోందని పరిశీలకుల వ్యాఖ్య.
Gayathri| Last Updated: గురువారం, 3 ఏప్రియల్ 2008 (12:05 IST)దీనిపై మరింత చదవండి :