పేదల ఊటీ "ఏర్కాడు"లో హ్యాపీ సమ్మర్ ట్రిప్..!!

Hill Station
Ganesh|
PTI
తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి దగ్గర్లోగల "ఏర్కాడు" దేశంలోని హిల్‌స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. చెన్నై నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్కాడును "పేదల ఊటీ" అని ముద్దుగా పిలుస్తుంటారు. సెర్వరాయన్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల (4,920 అడుగులు) ఎత్తులో ఉండే ఏర్కాడులో.. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. అందుకే ఎప్పుడూ చల్లగా ఉండే, ఈ హిల్‌స్టేషన్‌‌ను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తుంటారు.

ఏర్కాడుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. తమిళ భాషలో "ఏరి" అంటే "సరస్సు" అనే అర్థం కాగా, "కాడు" అంటే "అడవి" అని అర్థం. ఏరి కాడు అనే పదాలే క్రమంగా "ఏర్కాడు"గా రూపాంతరం చెందినట్లు స్థానికులు చెబుతుంటారు. ఏర్కాడు కాఫీ తోటలకు కమలా పండ్లకు ప్రసిద్ధి. ఏర్కాడులో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సారధ్యంలో నిర్వహించబడే "ఆర్కిడారియం" పర్యాటకులకు కనువిందు చేస్తుంటుంది.

Bird
FILE
అలాగే ఏర్కాడులోని అతి ఎత్తైన ప్రదేశం "సెర్వరాయణ్ దేవాలయం" చూడదగ్గ ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి 5326 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడు కొండల ప్రాంతం "షెవరాయ్ హిల్స్"గా పిలువబడుతోంది. ఇక్కడ అడవిదున్నలు, జింకలు, ఎలుకలు, కుందేళ్లు, నక్కలు, మాంగూస్, ఉడుతలు, పావురాళ్లు, పాములు, బుల్‌బుల్ పిట్టలు, పక్షులు.. తదితర అడవి జంతువులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఏర్కాడులో అడుగుపెట్టగానే ఆకర్షించే మరో ప్రదేశం అందమైన "సరస్సు", అందులో పడవ షికార్లు. ఆ తరువాత చిన్న సైజు జంతు ప్రదర్శన శాల (జూ), అన్నా పార్కు చూడదగ్గవి. అన్నా పార్కులో పలు ఆకృతుల్లో కత్తిరించిన మొక్కలు, వివిధ రంగుల్లో విరబూసిన పువ్వులు, సేదదీర్చే కాంక్రీటు గుడారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. అలాగే హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ చూడదగ్గ మరో ప్రదేశం.


దీనిపై మరింత చదవండి :