మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Pavan Kumar
Last Modified: శుక్రవారం, 16 మే 2008 (15:59 IST)

పులుల సంరక్షణా కేంద్రం పెంచ్

మధ్య ప్రదేశ్‌లోని పులుల సంరక్షణా కేంద్రాల్లో పెంచ్ ఒకటి. పెంచ్ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్‌గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పూరా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్ పార్క్ ఉంది.

పెంచ్ జాతీయ పార్కులో అనేక కాల్వలు, నల్లాలు ప్రవహించటం ద్వారా పచ్చదనంతో అలరారుతుంది. ఈ పార్క్‌లో అతిఎత్తైన ప్రాంతం కాలపహార్. ఇది సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంది. పెంచ్ నది ఈ పార్క్ గుండా ప్రవహిస్తుంది. తద్వారా పులులతో పాటుగా ఇతర జంతువులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. పార్క్‌లో ఐదు చోట్ల నిరంతరం జలాలను కురిపించే జలపాతాలు ఉన్నాయి.

పెంచ్ పార్క్‌ను పులుల సంరక్షణా కేంద్రంగా 1977లో ప్రకటించారు. ఈ పార్క్ వైశాల్యం 449.39 చదరపు కి.మీ. 1983లో ఈ పార్క్‌ను జాతీయం చేశారు. దేశంలో 19వ పులుల సంరక్షణా కేంద్రం పెంచ్. పెంచ్ నదిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1977-1988 సంవత్సరాల మధ్య నిర్మించారు.

పెంచ్ పార్క్‌లో 1200 రకాల వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. దేశంలో అత్యధికంగా జంతువులు నివశిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రం పెంచ్. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌లో 90.3 జంతువులు నివశిస్తున్నాయి.

పెంచ్ పార్క్‌లో జీపులో తిరిగే అవకాశంతో పాటుగా, ఏనుగులపై సవారీ, పెంచ్ రిజర్వాయర్‌లో బోటింగ్, పెంచ్ నదిలో రివర్ రాఫ్టింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

వసతి

పెంచ్‌లో మధ్య ప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన హోటెల్ ఉంది. సమీపంలోని నాగపూర్‌లో అన్నితరగతుల వారికి అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయి.

సందర్శనా సమయం
సంవత్సరంలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ పార్క్‌ను సందర్శించటానికి అత్యుత్తమ సమయం. వర్షాకాల సమయం కావడంతో జులై 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు పార్క్‌ను మూసివేస్తారు.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : నాగపూర్ (92 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడి నుంచి జాతీయ రహదారి వెంట ఖ్వాసా వరకూ వచ్చి అక్కడి నుంచి 12 కి.మీ. దూరంలోని తురియా గేట్‌కు చేరుకోవాలి.

రైలు మార్గం : నాగపూర్ (92 కి.మీ.), జబల్ పూర్ (195 కి.మీ.) లు సమీపంలోని పెద్ద రైల్వే స్టేషన్లు. పెంచ్‌కు 60 కి.మీ. దూరంలో సియోనీ రైల్వే స్టేషన్ ఉంది.

రహదారి మార్గం : సియోనీ (60 కి.మీ.), ఛింద్వారా (120 కి.మీ.), నాగపూర్ (92 కి.మీ.), జబల్ పూర్ (195 కి.మీ.) .