మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Ganesh

ప్రపంచ వారసత్వ సంపద "చంపానేర్-పావగఢ్"

FILE
భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో పేరెన్నికగన్నవి చంపానేర్-పావగఢ్ ప్రదేశాలు. 2004వ సంవత్సరంలో యునెస్కో "ప్రపంచ వారసత్వ జాబితా" స్థానం సంపాదించుకున్న ఈ అపురూపమైన చారిత్రక ప్రదేశాలు... గుజరాత్ రాష్ట్రంలోని పాంచ్‌మహల్ జిల్లాలో ఉన్నాయి. ఎత్తయిన పావగఢ్ కొండపై ఉండే కాళికామాత ఆలయం ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రాంతంలోనే ఎత్తయిన కొండపై వెలసిన కోట క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గుజరాత్‌కు రాజధానిగా విలసిల్లింది. ఈ పరిసర ప్రాంతంలోనే క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దందాకా ఎన్నో రకాల కోటలు, రాజప్రాసాదాలు, పురాతన కట్టడాలు, మతపరమైన కట్టడాలను నిర్మించారు. అవి నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఉంటాయి.

చంపానేర్-పావగఢ్ ప్రాంతాలను చరిత్రను చూస్తే.. వనరాజ్ చావడ రాజు తన భార్య చంపా పేరుతో పావగఢ్ కొండ దిగువ ప్రాంతంలో చంపానేర్‌ను స్థాపించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత పటాయి రావల్ కుటుంబం ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. నవరాత్రి ఉత్సవ సమయంలో కాళికామాత నృత్యం చేస్తుండగా.. చివరి పటాయి రాజు జైసింహ్ చెడు చూపులవల్ల కాళిక శాపానికి గురైనట్లు చెబుతుంటారు.

అలా శాపానికి గురైన జైసింహ్ రాజ్యమైన పావగఢ్‌ను.. గుజరాత్ చక్రవర్తి మహమ్మద్ బెగ్డా ఆక్రమించుకున్నాడని ఓ కథ ప్రచారంలో ఉంది. జైసింహ్‌ను బెగ్డా యుద్ధంలో ఓడించి చంపివేశాడు. ఆ తరువాత కొద్దికాలానికి తన రాజధానిని దౌత్య కారాణాల చేత అహ్మదాబాద్ నుంచి చంపానేర్‌కు మార్చినట్లు తెలుస్తోంది.

FILE
రాజధానిని చంపానేర్‌కు మార్చిన తరువాత బెగ్డా అనేక సుందరమైన కట్టడాలను నిర్మించినట్లు కథనం. అలా బెగ్డా కట్టించిన కట్టడాల్లో ముఖ్యమైనవి చంపానేర్ కోట, ఓరా మసీదు, మాండవి, కీర్తి స్తంభము, షాల్క్ దేవాలయం, జామా మసీదు, నగీనా మసీదు, కేవ్డా మసీదు.. మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ నేటికీ దర్శనమిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

పైన చెప్పుకున్న ప్రదేశాలుగాక.. చంపాగడ్-పావనేర్ ప్రాంతంలో అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా "కాళికామాత ఆలయం" గురించి చెప్పుకోవాలి. 550 మీటర్లు అంటే 1523 అడుగులు ఎత్తయిన కొండపై వెలసిన ఈ దేవాలయ సందర్శనకై దూర ప్రాంతాల నుంచి సంవత్సరం పొడవునా పర్యాటకులు, భక్తులు తరలి వస్తుంటారు.

అమ్మవారి కరుణా కటాక్షాలను పొందటంతోపాటు.. కొండపై నుంచి చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా పొందేందుకు పర్యాటకులు, భక్తులు నిత్యం తరలివస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కొండపైని ఆలయానికి వెళ్లేందుకు "రోప్ వే" సౌకర్యం కూడా ఉండటం పర్యాటకులకు మరో ఆకర్షణగా చెప్పవచ్చు. రోప్‌ వేలో ప్రయాణించిన తరువాత మళ్లీ ఆలయం చేరుకునేందుకు 250 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

ఈ ప్రాంతపు మరో విశేషం ఏంటంటే.. ప్రముఖ సంగీత విధ్వాంసుడు బైజూ బవ్రా చంపానేర్‌లోనే జన్మించారు. ఎలా వెళ్లాలంటే... చంపానేర్.. పావగఢ్ ప్రాంతం అహ్మదాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే వడోదరా నుంచి అయితే కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇకపోతే.. చంపానేర్ ప్రాంతం పంచ్‌మహల్ జిల్లా ముఖ ద్వారంగా కూడా పరిగణించబడుతుంది.

వడోదరా నుంచి చంపానేర్‌కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స్తోమత కలిగినవారు సొంత వాహనాల్లోనూ, ప్రైవేటు అద్దె వాహనాల్లోనూ వెళ్లవచ్చు. వడోదరా నుంచి పలు ట్యాక్సీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. బస్సుకంటే ట్యాక్సీల్లోనూ, సొంత వాహనాల్లోనే వెళ్లటం మంచిది. ఎందుకంటే.. మధ్యలో జంబుగూడ లాంటి మరికొన్ని పర్యాటక ప్రదేశాలను చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి..!