కవితా దశాబ్ది సంకలనం

Raju|
ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, డాక్టర్ పెన్నా శివరామకృష్ణల సంపాదకత్వంలో వెలువడిన 'కవితా దశాబ్ది' సంకలనంలో వైవిధ్యంతో కూడిన కవితలు చోటు చేసుకున్నాయి. వీటి నేపధ్యం విషయానికి వస్తే.. భారత దేశంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం 1991లో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది.

ఈ విధానాల కారణంగా దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి అనేక మంది కవులు, కవయిత్రుల కలాలకు పదును పెట్టాయి. దళితవాదం స్త్రీవాదం, కులతత్వం, ఆత్మగౌరవ పోరాటాలు, సాంస్కృతిక కాలుష్యం, విప్లవ రాజకీయాలు ఇత్యాదులన్నీ కవితా వస్తువులయ్యాయి. ఇవే కవితా దశాబ్ది సంకలనంలోని కవితలకు నేపథ్యంగా మారాయి.

ఇది నూటయాభైమంది కవులు కవయిత్రుల కవితా సంకలనం. 1991-2000 సంవత్సరాల మధ్య దేశంలో జరిగిన మార్పులను ప్రతిబింబిస్తూ ఈ సంకలన రచయితలు తమ భావాలను అక్షరీకరించారు. మచ్చుకు కొన్ని చూద్దాం. ఊర్మిళా దేవి నిద్రకు రామాయణంలో విశిష్ట స్థానం ఉంది. ఊర్మిళను విడిచిన మర్నాడు అనే కవితలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ లక్ష్మణుడి కర్తవ్య దీక్షకు కొత్త నిర్వచనం ఇస్తూ ఇలా కవిత్వీకరించారు. "స్వప్నాలకు రెక్కలు కత్తిరించడమే అన్ని కర్తవ్యాల పరాకాష్ట"

లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలు సహజమైన మన సమాజంలో స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో అవాంఛనీయమైన మార్పులు వస్తున్నాయి. స్త్రీల పట్ల వివక్షత గురించి భావగంభీరంగా శిక్షాపత్రం కవితలో ఘంటసాల నిర్మల ఇలా అంటారు. "ఆమె -అమ్మ-కు ఆలోచించే మెదడేది?" అన్ని ప్రశ్నిస్తూనే 'వెర్రెత్తిన నాగరికత చేతిలో చిట్లిన చిన్నారి ప్రాణం.. ఎర్ర మరకై మిగులుతుంది.." అని ముగిస్తారు.

మరో కవితలో మద్దెల శాంతయ్య.. మతం మారినంత మాత్రాన మనస్తత్వాలు మారవని సమాజపు పోకడను ఎత్తి చూపారు. తను రాసిన ఒ.సి క్రీస్తు కవితలో "మాల ఫాదరీ, సాలె ఫాదరీ, కమ్మ ఫాదరీ, కమ్మ సిస్టరమ్మ, రెడ్డి సిస్టరమ్మ'లు ఉన్నందుకే 'ఒ.సి క్రీస్తు'ను మాల క్రీస్తుగానో మాదిగ క్రీస్తుగానో రమ్మని ప్రార్థిస్తుంటాం" అనే చరణాలు సభ్యసమాజాన్ని ఒక కుదుపు కుదుపుతాయి.

'ఇరవయ్యో శతాబ్దంలోని చివరి దశాబ్దం ఇరవై ఒకటవ శతాబ్దానికి ప్రవేశద్వారంగా అమరింది' అంటూ ఈ కవితా సంపుటి సంపాదకులు చేసిన వ్యాఖ్య సారాంశాన్ని పాఠకులు ఆదరించాలి మరి.

కవితా దశాబ్ది పేజీలు 332. ధర.150 రూపాయలు
లభ్యమయ్యే చోటు అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు.


దీనిపై మరింత చదవండి :