సేవా కార్యక్రమాలకోసం హైదరాబాదీ ఎన్జీవోలతో ఐబీఎం టైఅప్..!

Ganesh|
సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకుగానూ హైదరాబాద్‌కు చెందిన ఐదు ఎన్జీవో సంస్థలతో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఐబీఎం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐబీఎంకు చెందిన ఉద్యోగులు ఈ ఎన్జీవో సంస్థలతో కలిసి పనిచేస్తారని ఐబీఎం ఇండియా డైరెక్టర్ రమేష్ నరసింహన్, కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ వెల్లడించారు.

తాము ఒప్పందం చేసుకున్న ఐదు హైదరాబాదీ ఎన్జీవో సంస్థలతోపాటు ఎలాంటి లాభాపేక్షా లేకుండా నడిచే ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. కార్పొరేట్ సర్వీస్ కాల్స్ పేరుతో నిర్వహించే ఈ సోషల్ సర్వీస్ కార్యక్రమంలో భాగగా.. వివిధ ఎన్జీవో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఈ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఏడు దేశాలకు చెందిన పదిమంది ఐబీఎం ఉద్యోగులు హైదరాబాద్ వచ్చారనీ రమేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఫిబ్రవరి నుంచి మే నెల మధ్య మొత్తం 19 దేశాలకు చెందిన 30 మంది ఐబిఎం ఉద్యోగులు హైదరాబాద్‌లో ఈ సంస్థలతో కలిసి పనిచేస్తారని రమేష్ వివరించారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాదీ సంస్థల్లో.. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, జననీ ఫుడ్స్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు.


దీనిపై మరింత చదవండి :