బుధవారం, 15 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2026 (17:33 IST)

Gold, silver prices: సోమవారం రూ.1.85 లక్షలకు పలకనున్న పసిడి ధరలు.. కారణం అదే

gold
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు శనివారం తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత పెరుగుతున్న అనిశ్చితి పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు నడిపించవచ్చని, ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల వల్ల సోమవారం నుండి బంగారం ధరలు ఊహించని విధంగా పెరగనున్నాయని తెలిపారు.
 
ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం టెహ్రాన్ భారీ పేలుళ్లతో కుదేలైంది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న యుద్ధ సంచలనం ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితికి ఆజ్యం పోస్తుందని విశ్లేషకులు తెలిపారు. దీంతో పెట్టుబడిదారులు బంగారం-వెండిపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. 
 
కామెక్స్ బంగారం ప్రస్తుతం ఔన్సుకు $5,300 వద్ద నిరోధకతను ఎదుర్కొంటుందని వారు గుర్తించారు. దీని ప్రకారం దేశీయ బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,68,000 నుండి రూ. 1,70,000 వరకు పెరగవచ్చునని మార్కెట్ నిపుణుడు వివరించారు.
 
సాంకేతిక పరంగా, మునుపటి కన్సాలిడేషన్ పరిధిని అధిగమించిన తర్వాత ఎంసీఎక్స్ బంగారం రూ. 1,60,000 మార్కును నిర్ణయాత్మకంగా అధిగమించింది. ఇకపోతే.. హోలీ పండుగ ముంగిట పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్ తగిలింది. అంతర్జాతీయ రాజకీయాల్లో తలెత్తిన పెను మార్పులు భారతీయ మార్కెట్లను కుదిపేయనున్నాయి. ఈ పరిణామం వల్ల సోమవారం మార్కెట్ తెరవగానే బంగారం ధరల్లో భారీ సునామీ రాబోతోందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రముఖ గోల్డ్ రిటైలర్ అండ్ ఎక్స్‌పోర్టర్, అనలిస్ట్ మంజులా రావు ప్రకారం.. సోమవారం ఒక్కరోజే తులం బంగారం ధర ఏకంగా 20 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇంతటి భారీ మార్పు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. సోమవారం పసిడి రేటు రూ.1.8 లక్షల నుంచి రూ.1.85 లక్షలకు పెరగొచ్చని అంచనా వేశారు.